గ‌రుడ బ‌స్సులో కృష్ణార్జున‌యుద్ధం… కేటీఆర్ ఆగ్ర‌హం

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సినీరంగం ఎంత మొత్తుకుంటున్నా పైర‌సీ ఆగ‌డం లేదు. పైర‌సీకి వ్య‌తిరేకంగా తీసుకుంటున్న చ‌ర్య‌లేవీ… ఫ‌లితాన్నివ్వ‌డం లేదు. సినిమా రిలీజ‌యిన మ‌రుక్ష‌ణం పైర‌సీ వీడియో మార్కెట్ లోకొస్తోంది. సినిమాను కోలుకోలేని దెబ్బ‌తీస్తోంది. సినీ ప్ర‌ముఖులు విజ్ఞ‌ప్తి మేర‌కు పైర‌సీపై ఉక్కుపాదం మోపుతామ‌ని ప్ర‌భుత్వాలు చెప్తున్న మాట‌లు ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నాయి. సామాన్యుల సంగ‌తి ప‌క్క‌న పెడితే సాక్షాత్తూ ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌లే పైర‌సీని ప్రోత్స‌హిస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీలో జ‌రిగిన ఘ‌ట‌నే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

నాని ఇటీవ‌ల న‌టించిన సినిమా కృష్ణార్జున యుద్ధం. ఈ సినిమా రిలీజ‌యిన మ‌రుస‌టి రోజే… తెలంగాణ ఆర్టీసీ గ‌రుడబ‌స్సులోని టీవీలో కృష్ణార్జున‌యుద్ధం పైర‌సీకాపీని ప్ర‌ద‌ర్శించారు. కొత్త సినిమా ఫ్రీగా వ‌చ్చిందిక‌దా అని అంద‌రిలా ఆలోచించ‌కుండా… బాధ్య‌త‌గ‌ల పౌరుడొక‌రు… ఈ పైర‌సీ వ్య‌వ‌హారాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. సునీల్ అనే యువ‌కుడు హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు వ‌స్తున్న గ‌రుడ బ‌స్సులోని టీవీలో కృష్ణార్జున‌యుద్ధం ప్ర‌ద‌ర్శిత‌మవుతున్న స్క్రీన్ షాట్ ను తీసి కేటీఆర్ కు ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ప్ర‌భుత్వ సంస్థ‌ల్లోనే ఇలాంటి పైర‌సీ జ‌రిగితే… ఇక పైర‌సీ నియంత్రించాల‌ని సామాన్యుడిని ఎలా అడుగుతార‌ని ప్ర‌శ్నించారు. సునీల్ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు చేసిన ప‌ని బాధ్య‌తారాహిత్య‌మ‌ని అన్నారు. సంస్థ‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాలని జాయింట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ను కోరుతున్న‌ట్టు కేటీఆర్ తెలిపారు.

Krishnarjuna Yuddham movie plays in Garuda Bus then KTR Angry on that

KTR on Krishnarjuna Yuddham movie