మోడీని భయపెట్టిన బీజేపీ కార్యకర్త…!

Pm Narendra Modi Andhra Pradesh Tour May Be Postponed

ప్రధాని మోదీకి సొంత పార్టీ కార్యకర్త చెమటలు పట్టించిన సంఘటన తాజాగా ఆ పార్టీ నేతల్లో సంచలనంగా మారింది. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు బీజేపీ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కార్యకర్తలతో మోదీ నేరుగా లైవ్‌లో మాట్లాడే విధంగా ‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలిదశలో తమిళనాడు, పుదుచ్చేరి కార్యకర్తలతో మోదీ మాట్లాడారు. ఆ కార్యక్రమం జరుగుతుండగా పుదుచ్చేరికి చెందిన ఒక కార్యకర్త వేసిన ప్రశ్న మోదీని, బీజేపీని ఇరకాటంలో పడేసింది. పన్నులు వసూలు చేయడంలో బీజేపీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ, ప్రజా సంక్షేమంలో లేదని నిర్మల్ కుమార్ జైన్ అనే కార్యకర్త మోదీని నిలదీశారు. ‘దేశంలో మార్పు కోసం మీరు చేస్తున్న ప్రయత్నం మంచిదే. కానీ మధ్యతరగతి వర్గం ఆలోచన వేరుగా ఉంది.

మీ ప్రభుత్వం కేవలం పన్నుల వసూలుపైనే దృష్టి పెట్టింది. ప్రజలకు మీరు ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదు. ఆదాయ పన్ను విషయంలో, లోన్ ప్రాసెసింగ్‌లో జనానికి అన్యాయమే జరుగుతోంది. బ్యాంక్ లావాదేవీల ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మధ్యతరగతి వర్గం మీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. వారికి కూడా ప్రోత్సాహకాలు అవసరం. పన్ను వసూలులో ఉన్న శ్రద్ధ సాయం చేయడంలో కూడా ఉండాలి’ అని కార్యకర్త అన్నాడు. సొంత పార్టీ కార్యకర్త అలా నిలదీయడంతో మోడీ నీళ్లు నమిలారు. మాట దాటవేస్తూ మరో కార్యకర్తతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటను దృష్టిలో ఉంచుకుని బీజేపీ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ఇక మీదట ప్రతి నియోజకవర్గం నుంచి ప్రశ్నలు వచ్చిన తర్వాత వాటిని పరిశీలించి ప్రధానికి ఇబ్బంది లేని ప్రశ్నలనే ఆమోదించాలని అనుకుంటున్నారు. ఆ ప్రశ్న అడిగే కార్యకర్త పేరు, వయసు, పార్టీలో అతని క్రియాశీలత, పార్టీ నాయకత్వం పట్ల అతనికున్న అంకితభావం ఆధారంగా లైవ్‌లో మాట్లాడే అవకాశమివ్వనున్నారు. మొత్తానికి ఒక కార్యకర్త మోదీని, బీజేపీని బాగానే భయపెట్టాడుగా అంటూ ఛలోక్తులు వినిపిస్తున్నాయి.