Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత అల్పేశ్ ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ నేతలు తమదైన శైలిలో తిప్పికొట్టారు. ఒకప్పుడు నల్లగా ఉన్న ప్రధాని ఇప్పుడు తెల్లగా, ఆరోగ్యంగా కనిపించడానికి తైవాన్ నుంచి దిగుమతి చేసుకున్న పుట్టగొడుగులు తినడమే కారణమని అల్పేశ్ వ్యాఖ్యానించి కలకలం సృష్టించారు. ఇప్పుడు ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆ పార్టీ నేతలు అల్పేశ్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ పుట్టగొడుగు బొమ్మలు వేయించిన కేక్ కట్ చేశారు. ఈ కేక్ కటింగ్ ఫొటోలను బీజేపీ ప్రతినిధి తాజీందర్ బగ్గా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది తైవాన్ నుంచి తెప్పించిన పుట్టగొడుగుల కేక్ అని ఛలోక్తి విసిరారు.
ఓబీసీల తరపున పోరాడిన అల్పేశ్ చివరకు కాంగ్రెస్ లో చేరి రాధన్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. గుజరాత్ లో అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన రాధన్ పూర్ లో అల్పేశ్ తొలుత వెనుకబడినట్టు కనిపించినా..చివరకు విజయం సాధించారు. పటేల్ నియోజకవర్గానికి రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో పోరాడిన హార్దిక్ పటేల్, దళితుల తరపున పోరాడిన జిగ్నేష్ మెవానీ, ఓబీసీల అభ్యర్థి అల్పేశ్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేసినా… బీజేపీ విజయాన్ని అడ్డుకోలేకపోయారు.