లెబనాన్ రాజధాని బీరూట్‌లో భారీ పేలుడు సంభవించింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ పేలుళ్లలో 70 మందికి పైగా చనిపోగా.. నాలుగు వేలమందికి పైగా గాయపడినట్లు ఆదేశ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో జనం వణికిపోయారు. వీధుల వెంట పరుగులు తీశారు.
మొదటి పేలుడు సంభవించిన కాసేపటికే రెండో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా భూమి కంపించినంతగా ప్రమాద తీవ్రత ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే పేలుడుకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.