Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సంజయ్ లీలా భన్సాలీ పద్మావతిపై చెలరేగిన వివాదాలు ఇంకా సద్దుమణగకముందే…అదే కథతో సినిమా తీసేందుకు మరో నిర్మాత సిద్ధపడడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకి మై హూ పద్మావతి అనే టైటిల్ ఖరారయింది. నిర్మాత అశోక్ శేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజస్థాన్ రచయిత ఒకరు మై హూ పద్మావతికి స్క్రిప్ట్ అందించారు. రాజస్థానీ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. భన్సాలీ తన సినిమాలో చిత్తోర్ గఢ్ మహారాణి పద్మిణి గురించి అన్నీ అవాస్తవాలు చూపించారని, తమ సినిమా ద్వారా అసలు పద్మిణి ఎలా ఉంటుందో చూపించబోతున్నామని అశోక్ శేఖర్ తెలిపారు. రాజస్థాన్ కు చెందిన కొందరు చరిత్ర కారులతో సినిమా గురించి చర్చించామని అశోక్ చెప్పారు.
సినిమాలో అంతా కొత్తవారే నటిస్తారని, 2018లో రాజస్థాన్ లో షూటింగ్ జరుపుతామని ఆయన వెల్లడించారు. అయితే భన్సాలీ పద్మావతికి పోటీగా రాజ్ పుత్ లే మై హూ పద్మావతిని తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. భన్సాలీ సినిమాను రాజ్ పుత్ కర్ణిసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్,రాజస్థాన్, గుజరాత్ లో ఈ సినిమాను నిషేధించారు. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న బీహార్ లో కూడా పద్మావతిపై నిషేధం ఉంది. డిసెంబరు 1న విడుదల కావాల్సిన పద్మావతి రాజ్ పుత్ ల ఆందోళనలు, సీబీఎఫ్ సీ సర్టిఫికెట్ ఆలస్యం అయిన నేపథ్యంలో వాయిదా పడింది. 2018 ఫిబ్రవరిలో సినిమా రిలీజయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి భన్సాలీ ఇటీవలే పార్లమెంట్ ప్యానెల్ తో చర్చలు జరిపారు.