టాలీవుడ్ హీరోలు ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా బాలీవుడ్‌లో పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. బాలీవుడ్‌లోనే కాదు ఇతర భాషల్లో కూడా మెప్పించలేక పోతున్నారు. టాలీవుడ్‌లో ఎంత పెద్ద స్టార్ అయిన ఇతర భాషల్లోకి వెళ్తే మాత్రం అక్కడ జీరోలుగా మిగులుతున్నారు. అయితే ఇందుకు అల్లు అర్జున్‌ను మినహాయింపు అనుకోవచ్చు. ఈయన మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఈయన సినిమాలు అక్కడ స్టార్ హీరోలకు పోటీగా విడుదలై మంచి కలెక్షన్స్‌ను రాబట్టిన సందర్బాలు ఉన్నాయి. ఇక బన్నీ నటించిన పలు చిత్రాలు బాలీవుడ్ ప్రేక్షకులను యూట్యూబ్ ద్వారా అలరించాయి. అందుకే బన్నీకి బాలీవుడ్ నుండి పిలుపు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది.
బాలీవుడ్‌లో ప్రస్తుతం కపిల్‌దేవ్ బయోపిక్‌ను కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. కపిల్ దేవ్ కెప్టెన్సీలో టీం ఇండియా ప్రపంచకప్ గెలుచుకున్న విషయం తెల్సిందే. ప్రపంచ కప్ ప్రధానంగా సాగే కథతో ఈ చిత్రంను తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్ కృష్ణమాచార్య పాత్రను అల్లు అర్జున్‌తో వేయించాలని దర్శకుడు భావిస్తున్నాడు. ఇప్పటికే స్క్రీనింగ్ టెస్ట్ కూడా పూర్తి అయ్యిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం అందుతుంది. సినిమా కోసం దాదాపు 15 నుండి 20 రోజుల డేట్లను అల్లు అర్జున్ ఇవ్వాల్సి ఉంటుందట. ఇక ఈ చిత్రం కోసం బన్నీ క్రికెట్‌ను ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ పాత్రతో బాలీవుడ్‌లో గుర్తింపు దక్కించుకుంటే ముందు ముందు బాలీవుడ్‌లో డైరెక్ట్ సినిమాలను కూడా బన్నీ చేస్తాడేమో చూడాలి.