కరాచీలో బాంబు పేలుడు

కరాచీలో బాంబు పేలుడు

పాకిస్తాన్‌లోని కరాచీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. నాలుగంతస్తుల భవనంలో జరిగిన పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 15 మంది గాయపడ్డారు. కరాచీ యూనివర్సిటీ మస్కాన్‌ గేటు ఎదురుగా ఉన్న భవనంలో ఈ భారీ పేలుడు సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని, మృతులను ఆస్పత్రికి తరలించారని డాన్‌ పత్రిక పేర్కొంది. పేలుడుకు కారణం ఏంటనేది వెల్లడికాకపోయినా సిలిండర్‌ పేలడంతోనే ఈ భారీ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

భవనం రెండో అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా కరాచీలో మంగళవారం షిరిన్‌ జిన్నా కాలనీలోసి బస్‌ టెర్మినల్‌లో బాంబు పేలడంతో ఐదుగురు గాయపడిన ఉదంతం మరువకముందే ఈ భారీ పేలుడు వెలుగుచూసింది. పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అల్లుడు సఫ్దర్‌ అవన్‌ అరెస్ట్‌కు కరాచీ పోలీసులపై ఒత్తిడి పెంచేందుకు సింధ్‌ పోలీస్‌ చీఫ్‌ను పాక్‌ సేనలు కిడ్నాప్‌ చేశాయనే వదంతులపై ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బాజ్వా విచారణకు ఆదేశించిన క్రమంలో బాంబు పేలుళ్లు జరగడం గమనార్హం.