ప్రియుడు మోసం చేయడంతో న్యాయం చేయాలంటూ ప్రియురాలు రోడ్డుపై బైఠాయించిన ఘటన ఇర్కొడు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఇర్కొడు గ్రామానికి చెందిన కుంభం వెంకటరమణరెడ్డి, బండి రాణిలు గత 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. అనంతరం యాదగిరి గుట్ట దగ్గరలోని ఓ ప్రాంతంలో పెళ్లి చేసుకున్నారు.
రెండు రోజులు గడిచిన తర్వాత రాణి తల్లి రూరల్ పోలీసు స్టేషన్లో కూతురు కనబడటం లేదని ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకున్న ప్రేమికులు వెంటనే సిద్దిపేట రూరల్ పోలీసు స్టేషన్కు వచ్చి ఎస్సైని కలవడంతో ఆయన ఇరు కుటుంబీకులను పిలిపించి మాట్లాడారు. ఇదే క్రమంలో అబ్బాయి తన ఇంట్లో తల్లి ఒప్పుకోవడం లేదని కొన్నాళ్లు ఆగిన తర్వాత రాణిని తన ఇంటికి తీసుకెళ్లి బాగా చూసుకుంటానని చెప్పాడు.
అప్పటి వరకు హైదరాబాద్లో కొన్ని రోజులు తనతో పాటు ఉంచుకున్నాడు. ఇలా నెల రోజులు గడిచిన అనంతరం ఇంటికి రావాలని అనిపించడంతో వెంకటరమణరెడ్డి బైకుపై రాణిని గత ఆదివారం చిన్నగుండవెల్లిలోని వాళ్ల అమ్మమ్మ ఇంటి వద్ద వదిలి మా అమ్మను ఒప్పించి తీసుకెళ్తాన్నాని చెప్పి వెళ్లిపోయాడు. వదిలి వెళ్లిన ప్రియుడు వెంటనే వస్తానని రాకపోవడంతో సోమవారం వెంకటరమణరెడ్డి ఇంటికి వెళ్లింది.
దీంతో అక్కడ ప్రియుడు తల్లి ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటి వెనకాల ఉన్న ప్రదేశంలో 4 రోజులుగా నివాసం ఉంటుంది. దీంతో గురువారం పెద్దల దృష్టికి తీసుకెళ్లగా సాయంత్రం 5 గంటల వరకు పరిష్కరిస్తామని చెప్పారు. 5 దాటినా ఎవ్వరు స్పందించకపోవడంతో తనకు న్యాయం చేయాలని రోడ్డుపై కుటుంబీకులతో కలిసి బైఠాయించింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ధర్నాను విరమింపజేశారు.