ఐదేళ్ల పాటు ప్రేమ పేరిట కాలయాపన చేసి పెళ్లి చేసుకుంటాననే పేరుతో సహజీవనం చేసి, చివరకు మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగిందో యువతి. దేబాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం, 2010లో హైదరాబాద్ లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వచ్చిన మోహన్ కుమార్ అనే యువకుడితో చిక్కడపల్లిలోని ఓ మహిళా కళాశాలలో చదువుకుంటున్న నర్మద అనే అమ్మాయికి పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్యా పరిచయం స్నేహంగా మారి, ఆపై ప్రేమగా అవతరించగా, మోహన్ కుమార్ చదువు కోసం నర్మద రూ. 1.50 లక్షలు ఇచ్చింది. 2014లో చదువు పూర్తయిన క్రమంలో నర్మద తల్లిదండ్రులకు ఫోన్ చేసిన మోహన్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తామిద్దరం పెళ్లి చేసుకుంటామని, మరో సంబంధం చూడవద్దని చెప్పాడు. ఆపై కాగ్నిజెంట్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేరాడు. ఆపై దాదాపు ఐదు సంవత్సరాలుగా ఇద్దరూ సహజీవనం చేశారు. తనను పెళ్లి చేసుకోవాలని నర్మద కోరగా, చెల్లి పెళ్లి తరువాత చేసుకుందామని నమ్మించాడు. చెల్లి పెళ్లి తరువాత, తన తల్లి ఒప్పుకోవడం లేదని, పెళ్లి చేసుకోలేనని చెబుతూ, నర్మదను దూరం పెట్టసాగాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆపై తనకు న్యాయం జరగడం ఆలస్యమవుతోందని ఆరోపిస్తూ, ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది.