ప్రాణాలు తీస్తున్న ఆన్‌లైన్‌ గేమ్స్

ప్రాణాలు తీస్తున్న ఆన్‌లైన్‌ గేమ్స్

ఆన్‌లైన్‌ గేమ్‌ రమ్మీ ఎంతో భవిష్యత్‌ ఉన్న యువత ఉసురుతీస్తోంది. అరచేతిలో ప్రపంచాన్ని చూపే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రావడంతో సెల్‌ఫోన్, కంప్యూటర్‌ ల్యాప్‌టాప్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసవుతున్నారు. కాలక్షేపం కోసం ఆడుదామని వెబ్‌సైట్‌ లింకును ఓపెన్‌ చేస్తున్న యువకులు, సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు బానిసలుగా మారుతున్నారు. ఫలితంగా లక్షలాది రూపాయలు పోగొట్టుకొని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇందుకు ఇటీవల జమ్మికుంట పట్టణానికి చెందిన ఓ సాప్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి నిదర్శనం.

ఆన్‌లైన్‌ రమ్మీ ప్రాణాలు తీస్తోంది. జమ్మికుంట పట్టణానికి చెందిన యువకుడు హైదరాబాద్‌లో ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీతం వేలల్లో రావడంతో తల్లిదండ్రులు సంతోషంగా జీవిస్తున్నారు. అనుకోకుండా కుమారుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో కన్నీరుమున్నీరయ్యారు. యువకుడు లాక్‌డౌన్‌ నేపథ్యంలో జమ్మికుంటలో తల్లిదండ్రుల వద్దే ఉండగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌ వెళ్లి డ్యూటీలో చేరాడు. కొద్దికాలంగా ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసయ్యాడు. స్నేహితుల వద్ద క్రెడిట్‌కార్డులు తీసుకొని అప్పులపాలయ్యాడు.

ఆన్‌లైన్‌ రమ్మీ ఆట కారణంగా సుమారు రూ.30 లక్షల వరకు అప్పు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా తన పేరు మీద ఉన్న ఇంటి విలువ సమారు రూ.50 లక్షల వరకు మార్కెట్లో ధర పలుకుతుండగా, కుటుంబసభ్యులకు తెలియకుండా విక్రయించినట్లు తెలుస్తోంది. అప్పులు పెరిగిపోయి హైదరాబాద్‌లోని అద్దె ఇంట్లో నాలుగురోజులక్రితం బలవన్మరణం చెందాడు. దీంతో జమ్మికుంట పరిసర ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ రమ్మీ చర్చనీయాంశంగా మారింది.