జంబలకిడి పంబ : ప్రియురాలి ఇంటిముందు పోలీస్ ప్రియుడి ధర్నా !

Boy Friend Dharna in front of Girlfriend House at Nizamabad

అవును మీరు చదివింది కరక్టే… పొరపాటు పడలేదు. ‘ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా… తనను ప్రేమ పేరుతో మోసం చేసి, శారీరకంగా వాడుకుని, ముఖం చాటేశాడని ప్రియుడి ఇంటి ముందు బైటాయించిన ప్రియురాలు, పెళ్లి చేసుకోవాలని డిమాండ్…’ ఇవీ కదా తరచూ వచ్చే వార్తలు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ప్రియుడే బాధితుడయ్యాడు. తనకు న్యాయం చేయాలని ప్రేయసి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్‌లో జరిగిందీ విశేషం. బాధితుడు పోలీసు కావడం మరో విశేషం…

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్‌లో ఓ యువకుడు ఆందోళనకు దిగాడు. ప్రేమించిన యువతి మోసం చేసిందని ప్రియురాలి ఇంటి ముందు ధర్నా నిర్వహించాడు. ప్రియుడి ధర్నాకు స్థానిక యువకులు మద్దతు ప్రకటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రియుడ్ని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మక్లూర్‌ మండలం మాదాపూర్‌కు చెందిన ఎర్రోళ్ల రవి ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. వేల్పూర్‌ మండలం పడిగేల్‌కు చెందిన యువతిని పదేళ్లుగా ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు. తనను ప్రేమించిందని పేర్కొంటూ… ఆమెతో దిగిన ఫొటోలు అందరికీ చూపించాడు. అయితే, తన ప్రేమను కాదని, మరో యువకుడితో పెళ్లికి సిద్ధమైందని ఎర్రోళ్ల రవి యువతి ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. దీంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారు.