నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. రావిపాడు శివారులో ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థిని తోటి విద్యార్థి గొంతు నులిమి చంపేశాడు. వివరాలు.. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనూష అనే యువతి నరసరావుపేటలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
బొల్లాపల్లి మండలం పమిడిపాడు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి కూడా అదే కాలేజీలో చదువుతున్నాడు. కాగా అనూష, విష్ణు కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా యువతి మరో యువకుడితో చనువుగా ఉంటోందని విష్ణు యువతిని అనుమానిస్తున్నాడు.
ఈ క్రమంలోనే అనూషను మాట్లాడుకుందాం అని పిలిచి ఆమెతో గొడవకు దిగాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన యువకుడు పాలపాడు రోడ్డు గోవిందపురం మేజర్ కాలువ దగ్గర అనూషను గొంతు నులిమి దారుణంగా హత్య చేసి కాలువలోకి పడేశాడు. అనంతరం నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నిందితుడు విష్ణువర్ధన్ లొంగిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రేమ వ్యవహారంతోనే విద్యార్థినిని ప్రియుడు దారుణంగా హత్య చేశాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు తెలియజేయాల్సి ఉంది.
మరోవైపు గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. విద్యార్ధిని హత్యను నిరసిస్తూ స్థానికులు, కుటుంబసభ్యులు, తోటి విద్యార్ధులు రోడ్డెక్కారు. మృతదేహంతో పల్నాడు బస్టాండ్ వద్ద బైఠాయించారు. కాలేజీపైనా రాళ్లు రువ్వడంతో పాటు ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. రోడ్డుపై విద్యార్ధి సంఘాల నేతలు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.