నటీనటులు:సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ, మురళి శర్మ, పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర
మ్యూజిక్: జేబి
కెమెరామెన్: కార్తీక్ ఫలణి
ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి
నిర్మాత: ఎస్. శైలేంద్ర
డైరెక్టర్: ప్రభాకర్.పి
దర్శకుడు మారుతి సినిమాలు సరికొత్తగా ఉంటాయి. నెక్ట్స్ నువ్వే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఈటీవీ ప్రభాకర్ డైరెక్టర్‌గా, కన్నడ హీరో సుమంత్ శైలేంద్రను తెలుగు హీరోగా పరిచయం చేస్తూ మారుతి కథతో తెరకెక్కిన సినిమా బ్రాండ్ బాబు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్‌ను సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధుల కోసం సినిమాను ప్రత్యేకంగా ఈ రోజు ఏర్పాటు చేశారు. మరి మారుతి అందించిన కథ ఎలా ఉంది, దాన్ని ప్రభాకర్ ఎలా తెరకెక్కించారు? ప్రేక్షకుల అంచనాలను సినిమా అందుకుందా ? అనేది ఇప్పుడు చూద్దాం.
బ్రాండ్ బాబు స్టోరీ లైన్ :
పారిశ్రామికవేత్త రత్నం (మురళీ శర్మ) తన కొడుకు డైమండ్ బాబు (సుమంత్ శైలేంద్ర)ను చిన్నప్పటి నుంచి బ్రాండ్ బ్రాండ్ అంటూ పెంచుతాడు. డబ్బున్న వాళ్లు తప్ప పేదవాళ్లు, మధ్యతరగతి వాళ్లు మనుషులే కాదన్న మనస్తత్వం ఉన్న రత్నం తన కొడుకును కూడా తన ఆలోచనలకు తగ్గట్టుగానే సిద్దం చేస్తాడు. ఆఖరికి ఇంట్లో పని చేసే వాళ్లకి కూడా బ్రాండ్ బట్టలే వేసుకోవాలని అంటాడు రత్నం. అలా వస్తువుల దగ్గరనుంచి అలవాట్ల వరకు, తలకు రాసుకొనే నూనె దగ్గర నుంచి కాళ్లకు వేసుకునే చెప్పుల వరకు ప్రతీది బ్రాండ్‌దే అయ్యుండాలన్న పిచ్చిలో పెరిగిన డైమండ్, తన బ్రాండ్ వ్యాల్యూ పెంచే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అనుకోకుండా తన ఫోన్‌కు వచ్చిన రాంగ్ మెసేజ్ ద్వారా హోం మినిస్టర్ కూతుర్ని (పూజిత) ప్రేమించడం మొదలుపెడతాడు. సందట్లో సడేమియా అంటూ తనకు ‘హోం మినిస్టర్ అల్లుడు’ అనే బ్రాండ్ వస్తుంది కదా అని పెళ్లికి సిద్ధమైపోతాడు. కానీ నిశ్చితార్థం సమయానికి ఊహించని ట్విస్ట్ ఒకటి తండ్రీకోడుకులకి తెలుస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటి? డైమండ్ ప్రేమించింది హోం మినిస్టర్ కూతుర్ని కాదా? మరి ఎవరిని ? బ్రాండ్ పిచ్చి నుంచి డైమండ్ బాబు అతని తండ్రి రత్నం ఎలా బయట పడ్డారు..? అన్న విషయాలు తెరపై చూడాల్సిందే.
బ్రాండ్ బాబు ఏ బ్రాండ్ అంటే :
బ్రాండ్ బాబుగా తెలుగు తెరకు పరిచయం అయిన సుమంత్ శైలేంద్ర మంచి నటన కనబరిచాడు. రిచ్ ఫ్యామిలీ వారసుడిగా యాటిట్యూడ్ ఉన్న పాత్రలో జీవించాడు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్‌లో సన్నివేశాల్లో ఎమోషన్స్ చాలా బాగా పండించాడు. పేదింటి అమ్మాయి పాత్రలో ఈషా రెబ్బ సరిగ్గా సరిపోయింది. ఇటీవలే విజేత సినిమాలో మెప్పించిన మురళీ శర్మ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సూపర్బ్ అనిపించారు. పూజిత పొన్నాడను సినిమాలో అందంగా చూపించారు.
దర్శకుడిగా ఫుల్ ఫాంలో ఉన్న మారుతి రచయితగానూ సత్తా చాటాడు. తన మార్క్ కథా కథనాలతో సినిమాను వినోదాత్మకంగా మలిచాడు. దర్శకుడిగా ప్రభాకర్ కు బ్రాండ్ బాబు బ్రేక్ ఇస్తుందనే చెప్పాలి. నేటికాలంలో డబ్బుకి ప్రాధాన్యతనిస్తూ బ్రాండ్ కి ఇచ్చే విలువ సాటి మనిషికి ఇవ్వడం లేదు. ఇదే పాయింట్ ను తన స్టైల్ లో ఎంటర్టైనింగ్ గా రాసుకున్నాడు మారుతి. ఒక రిచ్ ఫ్యామిలీకి, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి మధ్య జరిగే కథే ఈ సినిమా. గతంలో సంపన్న కుటుంబమైనా కొడుకు ప్రేమించిన అమ్మాయి కోసం దిగి వచ్చి అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకున్న కథలు చూశాం. కానీ ఈ సినిమా బ్రాండ్ పేరిట కాస్త డిఫరెంట్ గా ఉంటుంది.
ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. హీరో అతడి ఫ్యామిలీ సన్నివేశాలు మంచి కామెడీను పుట్టిస్తాయి. ముఖ్యంగా మురళీశర్మ పాత్ర ఎప్పుడూ బ్రాండ్ బ్రాండ్ అంటూ తిరగడం ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్. హీరో తన ఇద్దరు అసిస్టెంట్స్ తో కలిసి తను ప్రేమించిన అమ్మాయిని పడేయడం కోసం పడే ఇబ్బందులు తెరపై నవ్వులు పూయించాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. కొంత కామెడీ అని నడిచిన కథలో ఇంటర్వెల్ టైమ్ కి వచ్చేసరికి ట్విస్ట్ రివీల్ అవుతుంది. బ్రాండ్ పేరు చెప్పి కామెడీని బాగానే పిండారు కానీ , ఎమోషన్స్ ని ప్రేక్షకులకు కనెక్ట్ చేయలేకపోయారు.
జెబీ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. హీరో సొంత బ్యానర్ కావటంతో ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు. సుమంత్ శైలేంద్రను టాలీవుడ్ కు పరిచయం చేసేందుకు భారీగానే ఖర్చు పెట్టారని చెప్పొచ్చు. దాదాపు సీరియల్లో కనిపించే ఆర్టిస్టులనే సినిమాలో తీసుకున్నాడు ప్రభాకర్. టెక్నీకల్ గా ఈ సినిమాను క్వాలిటీతో రూపొందించారు. ఓవరాల్ గా బ్రాండ్ బాబు మంచి టైం పాస్ కామెడీ ఎంటర్టైనర్గా ఆకట్టుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.