53రోజుల నిరీక్షణ తర్వాత తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయిడు రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చారు. దీంతో తెలంగాణలో తెదేపా మద్దతుదారులు, అభిమానులు. కోకాపేట్, మూవీ టవర్స్, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ వద్ద పెద్దఎత్తున టపాసులు కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నిజం గెలిచిందంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కోకాపేట్లో మూవీ టవర్స్ వచ్చిందంటే అది బాబు పుణ్యమేనని గుర్తుచేశారు. అక్రమ అరెస్టులు, కేసులు బనాయించడం తప్ప ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి శూన్యమని తెలిపారు. కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, కుత్బుల్లాపూర్, తదితర ప్రాంతాల్లో మిఠాయిలు పంచుకున్నారు. చేయని తప్పునకు బాబును బాధ్యుడిని చేసి కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారని తెదేపా మద్దతుదారులు మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్ ఎదుట బాణా సంచా కాలుస్తూ ఆనందోత్సవాలతో, చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
చంద్రబాబుకు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తర్వాత ఏపీ సర్కారు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ఉద్ధృతం చేస్తారని తెలంగాణ తెదేపా నేతలు తెలిపారు. ఓయూలో CBN ఫ్యాన్స్ ఆధ్వర్యంలో 10,116 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. భువనేశ్వరి చేపట్టిన యాత్రతో నిజం గెలిచిందని… అధికారం అడ్డం పెట్టుకొని వ్యవస్థలను ఎన్నో రోజులు నియంత్రణ చేయలేరని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు రావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తెదేపా కార్యకర్తలు, భారాస నాయకులు కలిసి సంబురాల్లో పాల్గొన్నారు. కల్లూరులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చారు. మచ్చలేని చంద్రబాబును అరెస్ట్ చేసి రాజకీయ వేధింపులకు గురి చేయటం బాధాకరమని వెంకటవీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం తెదేపా కార్యాలయంలో సంబురాలు అంబరాన్నంటాయి. తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ చంద్రబాబుకు జిందాబాద్‌లు కొట్టారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఖమ్మం తెదేపా కార్యాలయానికి వచ్చి సంబురాల్లో పాల్గొన్నారు.