Breaking: “జై బాబు” నినాదాలతో మార్మోగిన గచ్చిబౌలి

Breaking: Gachibowli is marooned with "Jai Babu" slogans
Breaking: Gachibowli is marooned with "Jai Babu" slogans

తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా’ హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో నిర్వహించిన సంఘీభావ సభకు ప్రజలు పోటెత్తారు. గచ్చిబౌలి మైదానంలో ఐటీ ఉద్యోగులు నిర్వహించిన సీబీఎన్ గ్రాటిట్యూట్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నగర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు వేలాదిగా గచ్చిబౌలి మైదానానికి చేరుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సైబర్‌ బాబుకు సంఘీభావంగా గళమెత్తారు. జై బాబు నినాదాలతో ఆ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. చంద్రబాబు విజన్‌తో నిర్మించిన సైబర్ టవర్స్‌ కు 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఐటీ ఉద్యోగులు భారీస్థాయిలో సంగీత విభావరి నిర్వహించారు. వేలాది మంది ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు, అనుచరులు తరలివచ్చి … మేమున్నామంటూ కృతజ్ఞత తెలిపారు.

హైదరాబాద్ తమ జీవితాలకు దారి చూపిన దార్శనికుడిని జైల్లో బంధించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం గెలిస్తుందనే నమ్మకం ఉందన్న ఐటీ ఉద్యో గులు… చంద్రబాబు అంటే పేరు మాత్రమే కాదని, ఒక బ్రాండ్ అంటూ నినదించారు. అందుకే ఆయన పట్ల గౌరవాన్ని చాటుకోడానికి సుమారు 1200 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్యక్రమం కోసం కష్టపడ్డారని చెప్పారు. ఐటీ ఉద్యోగులు తలపెట్టిన ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అక్రమంగా కారాగారంలో పెట్టినా చంద్రబాబు ప్రతిష్ఠ వంద రేట్లు పెరిగిందని, బతుకున్న వ్యక్తులకు.. ఈ స్థాయిలో కృతజ్ఞతలు తెలపడం తానెప్పుడూ చూడలేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు త్వరలోనే బయటకి వస్తారని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు.చంద్రబాబు సేవలను ఈ రోజు మనం గుర్తు చేసుకుంటుంటే…ఆయనను అక్రమంగా జైలులో నిర్బంధించడం దారుణమని…విశ్లేషకుడు నల్లమోతు చక్రవర్తి అన్నారు. చంద్రబాబు విజన్‌ వల్లనే ఈరోజు భాగ్యనగరం ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందని… సీనియర్ జర్నలిస్ట్‌ కందుల రమేష్‌ గుర్తుచేశారు. సీబీఎన్ గ్రాటిట్యూట్ కార్య క్రమంలో బెంగళూరు నుంచి వచ్చిన బీట్ గురు బ్యాండ్ బృందం అద్భుతమైన సంగీతంతో యువతను ఉర్రూతలూగించింది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్‌ తన బృందంతో కలిసిన చంద్రబాబుపైప్రత్యేకంగా ఆలపించిన పాటలు మైదానంలో ఉన్న వారిని ఉత్తేజపరిచాయి.

సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు జరిగిన ఈ కృతజ్ఞత సభకు వేలాది మంది అభిమానులు, ఐటీ ఉద్యోగులు కుటుంబ సమేతంగా తరలిరావడంతో గచ్చిబౌలి మైదానం జనసంద్రంగా మారింది. పలువురు ఐటీ ఉద్యోగులు మైదానంలో నేలపై పొర్లు దండాలు పెట్టి కృతజ్ఞత చాటుకున్నారు.