తాళి కట్టాల్సిన చేతులతో ఉరితాడు పట్టుకున్న వరుడు

తాళి కట్టాల్సిన చేతులతో ఉరితాడు పట్టుకున్న వరుడు

మరికొద్ది గంటల్లో తాళి కట్టాల్సిన చేతులతో తనమెడకే ఉరితాడు బిగించుకున్నాడు ఓ వరుడు. తల్లి లేని బాధ తెలియనివ్వకుండా పెంచిన తాతయ్య పెళ్లికి నెల రోజులు ముందే తనువు చాలించడం ‘పెళ్లి కొడుకు’ను చేసే కార్యక్రమం విషయ మై తండ్రితో గొడవ వంటి కారణా లతో కుంగిపోయిన వరుడు ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. వరుడిగా పెళ్లిపీట లెక్కితే చూద్దామని మురిసిపోయిన బంధుమిత్రులకు, కుటుంబ సభ్యు లకు గుండెకోత మిగిల్చాడు. వధూవరులను ఆశీర్వదించడానికి వేడుకకు వచ్చిన వారు ఘటన గురించి తెలిసి నివ్వెరపోయారు. పేట్‌ బషీరాబాద్‌  పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి.

మలక్‌పేటకు చెందిన రిటైర్డ్‌ లెక్చరర్‌ నక్కెర్తి శ్రీనివాస్‌చారి, పద్మజ రాణిల కుమారుడు సందీప్‌(24). చిన్నతనంలోనే సందీప్‌ తల్లి మృతి చెందింది. దీంతో శ్రీనివాస్‌చారి రెండో వివాహం చేసుకోవడంతో సందీప్‌ చిన్నతనం నుంచి తాతయ్య జాగేశ్వరరావు వద్ద పెరిగాడు. జాగేశ్వరరావు కూడా సందీప్‌కు తన తల్లి లేని లోటు తెలియనివ్వకుండా పెంచాడు. బీటెక్‌ వరకు చదువుకున్న సందీప్‌కు బోయిన్‌పల్లికి చెందిన ఓ యువతితో ఏప్రిల్‌ నెలలో నిశ్చితార్థం చేశారు. అయితే చిన్నప్పటినుంచి తనను అల్లారుముద్దుగా పెంచిన తాతయ్య జాగేశ్వరరావు నెలక్రితం మృతి చెందడంతో సందీప్‌ బాగా కుంగిపోయాడు. తాతయ్య చనిపోయి నెల కూడా గడవకుండానే తనకు పెళ్లి ఏమిటంటూ వ్యతిరేకిస్తూ వచ్చాడు. అయినప్పటికీ పెద్దలు ఈనెల 10న కొంపల్లి టీ–జంక్షన్‌లో ఉన్న శ్రీకన్వెన్షన్‌లో పెళ్లి నిశ్చయించారు.

సాంప్రదాయం ప్రకారంగా తండ్రి ఇంట్లో పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా సందీప్‌ దీన్ని వ్యతిరేకించాడు. ‘తన తల్లి చనిపోయిన ఇంట్లో నేను ‘పెళ్లి కొడుకు’కార్యక్రమాన్ని చేసుకోలేను’అని సందీప్‌ చెప్పడంతో ఆ కార్యక్రమానికి ఓ ఇంటిని అద్దెకు కూడా తీసుకుని నిర్వహించారు. ఈ క్రమంలో తండ్రి సందీప్‌ వైఖరిని తప్పుపట్టగా ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి వివాదం చెలరేగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సందీప్‌ ఆదివారం తెల్లవారుజామున కొంపల్లిలో ఉన్న వివాహ వేదిక వద్దకు వచ్చి తనకు కేటాయించిన గదిలోకి వెళ్లిపోయాడు.

సందీప్‌ కోపాన్ని కుటుంబ సభ్యులు అంతగా పట్టించుకోలేదు. గదిలోకి వెళ్లిన సందీప్‌ను చూసి అంతా సర్దుకుపోతుందనుకుని ఒంటరిగా వదిలేశారు కుటుంబ సభ్యులు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు వివాహ వేడుకలకు సిద్ధం చేసేందుకు సందీప్‌ గది తలుపును తట్టగా ఎంతకీ స్పందన లేదు. దీంతో మాస్టర్‌ కీ తో తలుపులు తెరిచి చూడగా సీలింగ్‌కు వేలాడుతూ సందీప్‌ కనిపించాడు. వెంటనే సందీప్‌ను సుచిత్ర సర్కిల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా..అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.