చిన్న నారాయణపురానికి చెందిన ఢిల్లీశ్వరరావు, వసంతలు వరుసకు అన్నాచెల్లెళ్లు. వీరు డిగ్రీ, డైట్ పూర్తి చేసి వేసవిలో శిక్షణ తీసుకుందామని విశాఖలోని మేనమామ తులసీదాస్ ఇంటికి వెళ్లారు. ఇంతలో లాక్‌డౌన్ ప్రకటించడంతో చాలా రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రెండు రోజుల ముందే ఇంటికి వద్దామని అక్కడి సిటీ కమిషనర్ అనుమతి తీసుకున్నారు. అన్నాచెల్లెళ్లతో పాటు మేనమామ కూతురు కుసుమ కూడా బయల్దేరింది. సోమవారం ఉదయం 3.30 గంటల సమయంలో డ్రైవర్ వీరిని తీసుకుని కారులో మందస మండలానికి పయనమయ్యారు.
రణస్థలం మండలం కోష్ట గ్రామానికి సమీపానికి వచ్చేసరికి.. జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని వీరి కారు అతివేగంగా వచ్చి బలంగా ఢీకొంది. దీంతో వెనుక సీటులో ఉన్న ఢిల్లీశ్వరరావు, వసంతలు అక్కడికక్కడే మృతి చెందారు. ముందుసీట్లలో ఉన్న డ్రైవర్ మూర్తి, కుసుమలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు మేమున్నాం సేవా సంస్థ అంబులెన్స్‌లో క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. జేఆర్‌పురం ఎస్‌ఐ ఇ.శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలకు రిమ్స్‌లోనే శవ పంచనామా చేయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.