ప్రేమించి పెళ్లి చేసుకుందని పోలీస్‌స్టేషన్ ఎదుటే చెల్లెలిపై అన్న దాడి చేసి కత్తితో పొడిచిన ఘటన సోమవారం రాత్రి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్‌స్టేషన్ వద్ద జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. సంగం మండలం జెండాదిబ్బ ప్రాంతానికి చెందిన శిరీష, కోవూరు మండలం కట్టకింద చెర్లోపాలేనికి చెందిన అశోక్ ప్రేమించుకున్నారు. అశోక్ క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. ఇద్దరూ మేజర్లు కావడంతో మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లికి ఇరు కుటుంబాలు అభ్యంతరం చెప్పాయి.
ఈ విషయం కోవూరు పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఎస్ఐ దాసరి వెంకటేశ్వరరావు సోమవారం ఇరు కుటుంబాలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. రాత్రి కావడంతో వారిని వెళ్లిపోయి మంగళవారం ఉదయం రావాలని చెప్పారు. ఆ సమయంలో స్టేషన్ బయట ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుంటున్నారు. శిరీష వారి కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో శిరీష అన్న హరీష్ ఒక్కసారిగా చెల్లెలుపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె గాయపడింది. పోలీసులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. హరీష్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.