సరదాగా గడిపేందుకు చేపల వేటకు బయలుదేరారు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు సొంత అన్నదమ్ములు.. మరో వ్యక్తి స్నేహితుడు. వీరంతా హైదరాబాద్ రహమత్‌నగర్ హబీబ్ ఫాతీమానగర్ ఫేజ్–1 బస్తీవాసులు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బోరబండకు చెందిన సొంత అన్నదమ్ములు జీషాన్(24), హన్నన్(22). వీరి స్నేహితులైన మలక్‌పేటకు చెందిన సయ్యద్ ఉబేర్(20), బంజారాహిల్స్ నివాసి హరీస్(21) ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. సెలవు రోజు సరదాగా గడపాలనుకున్నారు.
తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ కర్నూలు సమీపంలోని తమ బంధువుల ఫాంహౌస్ దగ్గర చేపల వేట కోసం స్విఫ్ట్ కారులో బయలుదేరారు. షాద్‌నగర్ సమీపంలోని అనూస్ పరిశ్రమ ఎదురుగా జాతీయ రహదారిపై వీరి కారు అదుపు తప్పి డివైడర్‌ను ఎక్కి అవతలి వైపు బెంగళూరు వైపు నుంచి కారు విడిభాగాల లోడుతో నగరానికి వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొంది. ప్రమాదంలో అన్నదమ్ములైన జీషాన్, హన్నన్‌తోపాటు సయ్యద్ ఉబేర్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన హరీస్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు షాద్‌నగర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతులు అవివాహితులని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.