కృష్ణా జిల్లాలో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చాట్రాయి మండలం సూరంపాలెంకు చెందిన ఎం.విజయ్‌కుమార్ కుమార్తె రోహిత విజయవాడ కానూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కళాశాలకు సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఆమె సోమవారం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తనకు ఏడాదిగా పరిచయమున్న అదే కళాశాలకు చెందిన విద్యార్థితో మనస్పర్థలు వచ్చాయని, తనతో అతను మాట్లాడటం లేదని ఆవేదన చెందింది.
దిగులు పడవద్దని తాము వచ్చి మాట్లాడతామని తల్లిదండ్రులు ఆమెకు ధైర్యం చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నా ఆమె తీయలేదు. దీంతో అనుమానంతో కుటుంబసభ్యుల్లో ఒకరు మంగళవారం రాత్రి హాస్టల్‌కు వచ్చి రోహిత గదిని చూడగా అక్కడ ఆమె ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. విషయం తల్లిదండ్రులకు చెప్పగా వారు చాట్రాయి నుంచి కానూరు వచ్చారు. హాస్టల్ గదిలో రోహిత మృతదేహాన్ని చూసి అనుమానం వ్యక్తం చేస్తూ బుధవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.