దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరంలో మరో భవన ప్రమాదం సంభవించింది. థానేలోని రబొడి ఏరియాలో నాలుగంతస్తుల భవనం ఆదివారం ఉదయం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాద సమయానికి భవనంలో 67 కుటుంబాలున్నట్టు తెలుస్తోంది. ఈ భవనం కూల్చివేతపై రెండేళ్ల కిందటే అధికారులు నోటీసులు జారీచేశారు. శిథిలావస్థకు చేరిన భవనాన్ని ఖాళీచేయాలని హెచ్చరించినా అలసత్వం ప్రదర్శించారు.
నాలుగంతస్తుల ఖాత్రి అపార్ట్మెంట్ భవనం మూడో ఫ్లోర్ శ్లాబు కూలి మొదటి అంతస్తుపై పడింది. దీంతో భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ప్రమాదంలో రమీజ్ షైక్ (32), గోస్ తంబోలి (38) ప్రాణాలు కోల్పోయారు. భవనం శ్లాబు పెచ్చులుపడి తీవ్రంగా గాయపడిన ముగ్గుర్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఇద్దరు చనిపోయారు. విపత్తు నిర్వహణ విభాగం అధికారులు మాట్లాడుతూ.. ఉదయం 6.10 గంటలకు తమకు ప్రమాదం గురించి సమాచారం వచ్చిందని తెలిపారు.
‘శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గుర్ని సహాయక సిబ్బంది బయటకు తీసి సంజీవని ఆస్పత్రి, లైఫ్లైన్ ఆస్పత్రికి తరలించారు.. అపార్ట్మెంట్లోని మిగతావారిని వేరే చోటుకు తరలించాం.. భవనం యజమానికి రెండేళ్ల కిందటే నోటీసులు జారీచేశాం’ అని అధికారి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే విపత్తు నిర్వహణ బృందం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిందని థానే డిప్యూటీ కమిషనర్ అశోక్ బూర్పుల్లే తెలిపారు.