లోయలోకి దూసుకెళ్లిన బస్సు

లోయలోకి దూసుకెళ్లిన బస్సు

మహారాష్ట్రలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు వెళుతోన్న బస్సు ప్రమాదానికి గురయ్యింది. నందూర్‌బార్ వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 35 మంది గాయపడ్డారు. కొండైబరి ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి బస్సులో 40 మందికిపైగా ఉన్నట్టు తెలుస్తోంది. సూరత్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రివేళ ప్రమాదం జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు లోపల చిక్కుకుపోయారు. క్షతగాత్రుల్లో పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

క్షతగాత్రులను వైద్యం కోసం నందూర్‌బార్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. బస్సును నియంత్రించలేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.