పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య

పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య

చైనాలో కోవిడ్ తగ్గుముఖం పడుతున్నా ప్రపంచంలోని మిగతా దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. హుబెయ్‌ ప్రావిన్సుల్లోని వుహాన్ నగరంలో తొలిసారిగా వెలుగుచూసిన కరోనా వైరస్.. వేలాది మందికి సోకింది. ఈ ప్రావిన్సుల్లోని దాదాపు 6 కోట్ల మంది జనాభా గత 45 రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇదిలా ఉండగా, మిగతా దేశాల్లో ముఖ్యంగా ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇటలీలో మంగళవారం మరో 27 మంది ప్రాణాలు కోల్పోగా, అక్కడ మృతుల సంఖ్య 79కి చేరింది.

అటు అమెరికాలోనూ మంగళవారం మరో ఇద్దరు చనిపోగా, మృతుల సంఖ్య 9కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,159 మంది మృత్యువాతపడగా, 92,000 కేసులు నమోదయినట్టు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. అమెరికాలో కరోనా మరణాలన్నీ వాషింగ్టన్‌లో చోటుచేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి నాటికి న్యూ హంపషైర్, జార్జియా, ఉత్తర కరోలినా సహా 15 రాష్ట్రాలల్లో 100కిపైగా కేసులు నమోదయ్యాయి.

జపాన్, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. బుధవారం కొత్తగా 516 కేసులు దక్షిణ కొరియాలో నమోదుకాగా, అక్కడ మొత్తం బాధితుల సంఖ్య 5,328కి చేరింది. మొత్తం 28 మంది ఇప్పటి వరకు మృతిచెందారు. ఇదే సమయంలో చైనాలో మంగళవారం కేవలం 119 కేసులు నమోదయ్యాయి. మంగళవారం మరో 38 మంది చనిపోయినట్టు చైనా అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు కరోనా వైరస్‌తో 2,981 మంది మృతిచెందగా, బాధితులు 80,270గా పేర్కొంది.