Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గౌరీ లంకేశ్ హత్య విషయంలో ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సమర్థించుకున్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా తాను నిజమే మాట్లాడతానని, మోడీ విషయంలోనూ తాను నిజమే మాట్లాడానని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఓ విషయంలో విమర్శ చేసినంత మాత్రాన తనను యాంటీ మోడీ అనడం సరైనది కాదన్నారు. ప్రధానిపై తనకు గౌరవముందని, కానీ కొన్ని విషయాల్లో మోడీతో ఏకీభవించలేనని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలపై తనను నోటికొచ్చినట్టు తిడుతున్న వారికి … తన ఎదురుగా వచ్చి సమాధానం చెప్పే ధైర్యం లేదని విమర్శించారు. ఇంతజరిగినా ఇప్పటికీ తన మాటలపైనే నిలబడతానని ఆయన స్పష్టంచేశారు.
గౌరీ లంకేశ్ కుటుంబంతో 20 ఏళ్లగా ప్రకాశ్ రాజ్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె హత్య కేసు నిందితులను ఇంకా పట్టుకోకపోవడంపైనా… ప్రధాని మౌనంగా ఉండడంపైనా ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు చేశారు. గౌరీలంకేశ్ హత్యకు నిరసనగా… తన జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తానని కూడా ఆయన అన్నారు. అయితే తర్వాత ఆయన తాను ఆ మాట అనలేదని, తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న అవార్డులను వెనక్కి ఇచ్చేటంత మూర్ఖుడిని కాదని వ్యాఖ్యానించారు. అయితే ప్రధానిని ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని విమర్శిస్తూ లక్నోకు చెందిన ఓ న్యాయవాది ఆయనపై కేసు దాఖలు చేశారు.