Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇన్నాళ్లు సినీ పరిశ్రమ, రాజకీయాలకే కుల జాడ్యం అంటుకుందని భావించాం. ఆ రెండు రంగాల్లో కుల పిచ్చి తగ్గితే నిజమైన ప్రతిభకు న్యాయం జరుగుతుందని అభ్యుదయ వాదుల ఆలోచన. ఇటీవల జరుగుతున్న కులాంతర వివాహాలు, కులాన్ని పట్టించుకోని యువతరాన్ని చూసాక నిజంగా మార్పు వస్తుందన్న సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ కులనేత సోషల్ మీడియా లో చేసిన ఓ పోస్ట్ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ సదరు నేత ఎవరిని కులాల రొచ్చులోకి లాగారో తెలుసా ?. సాక్షాత్తు ప్రజల్లో ఆధ్యాత్మిక జ్యోతులు వెలిగించే పని చేపట్టిన స్వామీజీలు, గురువులని తమ కులం వారు అని ఆయన ప్రకటించుకున్నారు.
స్వామీజీలు, గురువులు ఎక్కువమంది ఒకే కులానికి చెందిన వారు వుంటారు. అయితే ఆ కులానికి చెందిన వాళ్ళు కాకుండా వేరే కులానికి చెందిన స్వాములు, గురువులు కూడా వున్నారు. అలాంటి ఓ ముగ్గురు ప్రముఖలు తమ కులం వాళ్లే అని సదరు నేత ప్రకటించుకున్నారు. సినిమాల్లో పట్టు సంపాదించిన ఆ కులం రాజకీయంలో కూడా పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నా ఇంకా కాలం కలిసిరాలేదు. ఆ కుల నేత ప్రకటించిన జాబితాలో ప్రఖ్యాత యోగ గురు జగ్గీ వాసుదేవ్, గోల్డెన్ టెంపుల్ కట్టించిన నారాయణిమ్మ, శ్రీశ్రీశ్రీ యోగానంద భారతీస్వామి. ఈ ముగ్గురు గురువులకు కూడా కులాన్ని అంటించిన నేతల మరగుజ్జు ఆలోచనలు చూసి జాలిపడడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.