Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుని ఏ విధంగా అయినా ఇరుకున పెట్టడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ నానా అగచాట్లు పడుతోంది. ఇప్పుడు ఎయిర్ ఆసియా వివాదంలో వారికి ఓ ఛాన్స్ దొరికిందని సంబరపడుతున్నారు. దీనికి సంబంధించి బీజేపీ కి గొంతుకగా పని చేస్తున్న రిపబ్లిక్ టీవీకి ఓ టెలిఫోన్ సంభాషణ రికార్డెడ్ ఆడియో కూడా అందిందట. ఈ విషయం చెప్పుకుని వరస పరాజయాలతో ఖంగు తింటున్న మోడీ భక్త గణం తెగ చంకలు గుద్దుకుంటోంది. ఇంతకీ ఆ ఆడియో లో ఏముందో తెలుసా ?
టీడీపీ ఎంపీ అశోకగజపతి రాజు విమానయాన శాఖ మంత్రిగా వున్న సమయంలో కొన్ని నియమనిబంధనల్లో మార్పులు చేశారు . ఆ మార్పులు ఎయిర్ ఏషియా కి లబ్ది చేకూర్చేందుకే అన్న కోణంలో సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఎయిర్ ఏషియా సీఈఓ ఫెర్నాండెస్ ని ఈ విషయంలో సిబిఐ ఇప్పటికే ప్రశ్నించింది కూడా. అయితే ఇందులో ఎక్కడా చంద్రబాబు లేదా అశోకగజపతి రాజు ప్రస్తావన లేదు. కానీ ఎయిర్ ఏషియా భారత్ విభాగానికి సీఈఓ గా వున్న శాండిల్య , ఓ ఇన్వెస్టర్ దూబే కి ప్రెసెంటేషన్ ఇస్తూ తమ సంస్థ గొప్పదనం కోసం విమానయాన శాఖలో తమ పనులు అవుతాయని చెప్పుకున్నారు. అశోకగజపత్జి తనకి ఆప్తుడని , ఏపీ సీఎం చంద్రబాబుని నైస్ గా చూసుకుంటే చాలని శాండిల్య సదరు ఇన్వెస్టర్ కి చెప్పుకున్నారు. పైగా ఆ సంభాషణల్లో చంద్రబాబు కాబోయే పీఎం అని కూడా అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారం ఎలా వుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు పెద్ద పెద్ద పెట్టుబడిదారుల్ని ఆకర్షించడానికిచెప్పిన కబుర్లు లాగా వున్నాయి. వీటిని పట్టుకుని చంద్రబాబు మీద కేసు …అది కూడా సిబిఐ స్థాయి విచారణ అంటేనే నవ్వొస్తోంది. చంద్రబాబుని చూసి మోడీ ఏ విధంగా గజగజలాడుతున్నాడో చెప్పేందుకు ఇంతకు మించిన ఉదాహరణ ఏముంది ?
బీజేపీ వేస్తున్న ఈ చౌకబారు ఎత్తుగడలు , చేస్తున్న పనులు చూసి సామాన్య జనం నవ్వుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలు తమని నమ్మించి మోసం చేసిన బీజేపీ చేస్తున్న చౌకబారు ప్రచారపు వలలో పడతారు అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఉండదు. నేతలు , పార్టీల కన్నా ప్రజలు తెలివైన వాళ్ళే అని నిజమయ్యే రోజులు ముందున్నాయి.