Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేనలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని, ఇవన్నీ మీడియా సృష్టించిన కథనాలని జేడీ కొట్టి పారేశారు. అయితే తాను స్వచ్చంద విమరణ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం నిజమేనన్నారు. తన అప్లికేషన్ ను మహారాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని, రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని జేడీ తెలిపారు. ఇంకా ఏడేళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ…జేడీ లక్ష్మీనారాయణ వాలెంటరీ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారని, జనసేనలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
జేడీ జనసేనలోకి వస్తే ఆహ్వానిస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు కూడా. ఇప్పుడు జేడీ మాత్రం జనసేనలో చేరే అవకాశం లేదంటున్నారు. వైసీపీలో జేడీ ఎలాగూ చేరరు.ఇక మిగిలింది టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్. టీడీపీలో చేరితే…జగన్ అవినీతికేసులపై ఆయన చేసిన దర్యాప్తు విశ్వసనీయత కోల్పోతుంది. టీడీపీ మీద ఉన్న అభిమానంతో.. భవిష్యత్ లక్ష్యాలతోనే ఆయన జగన్ పై కక్షపూరితంగా వ్యవహరించాని వైసీపీ తప్పుడు ప్రచారం కూడా చేయవచ్చు అందుకే టీడీపీలో చేరే ఆలోచన జేడీ చేయకపోవచ్చు. ఇక మిగిలింది కాంగ్రెస్, బీజేపీ. ఈ రెండు పార్టీల్లో దేనిలోనైనా జేడీ చేరే అవకాశముంది. జగన్, గాలి జనార్ధన్ రెడ్డి కేసుల దర్యాప్తులో అప్పటి అధికార కాంగ్రెస్ జేడీకి పూర్తి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు ఇచ్చి.ప్రోత్సాహమిచ్చింది. దీనివల్లే జేడీ గాలి,జగన్ కేసులను ఆ స్థాయిలో దర్యాప్తు చేయగలిగారు. ఉమ్మడిఆంధ్రప్రదేశ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే మొదట బాగానే ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్ తర్వాతిరోజుల్లో తన రాజకీయప్రయోజనాల కోసం జేడీని పక్కన పెట్టింది. అనంతరం మహారాష్ట్రకు పంపింది. ఈ దృష్ట్యా జేడీ కాంగ్రెస్ లోనూ చేరకపోవచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక మిగిలింది బీజేపీ. కాపు నాయకులను చేరదీసి రాష్ట్రంలో కొత్త రాజకీయసమీకరణాలకు తెరలేపుతున్న బీజేపీ…ఆ వర్గానికే చెందిన జేడీని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా విశ్వసనీయత, ఆదరణ రెండూ పొందాలని వ్యూహం రచిస్తోంది. జేడీకూడా బీజపీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్టు సమాచారం.