ఫోటో మార్ఫింగ్‌ లు, వర్మ మీద స్పందించిన చంద్రబాబు !

CBN Comments On Varma

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ సినిమా విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. చంద్రబాబు ఈరోజు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో ఈ సినిమా గురించి ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో కొత్త తరం ఓటర్లే ఎక్కువని, వారికి ఎన్టీఆర్‌ చరిత్ర మీద అవగాహన పెంచాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్టీఆర్‌ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని, కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తిని అందరూ చాటిచెప్పాలని బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన చిత్రం కథానాయకుడు ఎన్టీఆర్ స్ఫూర్తిని తెలియజేసేలా ఉందని చెప్పుకొచ్చారు. మహానాయకుడు కూడా అలానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవాలను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని పరోక్షంగా రామ్ గోపాల్ వర్మను హెచ్చరించారు.

అలాగే ఈ ఎన్నికల్లో పోటీ పడేది నేరస్థులతోనే అని ప్రత్యర్థుల నేరచరిత్ర గుర్తుంచుకోవాలని హత్యలు, దోపిడీలు, దాడులు ప్రత్యర్థుల సంస్కృతి అని విమర్శించారు. అధికారం కోసం దేనికైనా దిగజారే పార్టీ వైసీపీ అని వ్యాఖ్యానించారు. వాళ్లే సీన్‌ క్రియేట్‌ చేసి దుష్ప్రచారం చేస్తారని అలాగే ఫోటోలను మార్ఫింగ్‌ చేస్తారని వీడియో కటింగ్‌ లు చేస్తారని అందుకే నేరస్థులతో పోరాటంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. చేయని తప్పులు తమపై రుద్దుతారని, తప్పులు జరిగేలా స్కెచ్‌లు వాళ్లే వేస్తారని అందుకే ఓక కన్ను ఎప్పుడూ ప్రతిపక్షంపై ఉండాలని నేతలతో చంద్రబాబు అన్నారు. రాజధానిలో రూ.లక్ష కోట్ల అవినీతి అని దుష్ప్రచారం చేసిన వైసీపీ ఆ వ్యవహారాన్ని తాను ఖండిస్తే వెనక్కి తగ్గిందని గుర్తుచేశారు. రాజధానికి, పోలవరంకు వ్యతిరేకంగా అనేక కేసులు వేశారని రాజకీయాల్లో నేరగాళ్లను తెచ్చిన పార్టీ వైసీపీ అని విమర్శించారు. ఓటమి భయంతోనే వైసీపీ కుట్రల మీద కుట్రలు చేస్తోందని, కులాల మధ్య చిచ్చు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, షా, కేసీఆర్‌, జగన్‌ కుమ్మక్కై కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. నలుగురి కుట్రలను ధైర్యంగా ఎదుర్కోవాలని నేతలకు తెలిపారు. అయితే బాబు మాటలు చింతమనేనిని వెనకేసుకు వచ్చేవిగా ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నారు.