చంద్రబాబు మీద వెన్నుపోటు వ్యాఖ్యలు చేసిన అమిత్ షా !

Amit Shah Sensational Comments On Chandrababu

చంద్రబాబు మోసకారి అని మామకే వెన్నుపోటు పొడిచారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. రాష్ట్రానికి కేంద్రం ఎంతో సాయం చేసినా దుష్ప్రచారంతో ఆయన ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పుల్వామా దాడిని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలో పర్యటించిన షా అర్బన్‌ జిల్లాల శక్తి కేంద్రాల సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన అమిత్ షా చంద్రబాబును టార్గెట్ చేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ లను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఇప్పుడు ప్రధాని మోదీని మోసం చేయాల ని చూస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఢిల్లీ, కోల్‌కతా వెళ్లి ధర్నాలు చేశారనీ ఆయన ధర్నా చేయాల్సింది వారి పార్టీ కార్యాలయం ముందేనని ఆయన అన్నారు. రా

ష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌తో తెలంగాణలో ప్రచారం చేస్తూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి, పోలవరానికి నిధులు ఇచ్చినా వాటిని చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయకుండా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. విభజన చట్టంలోని అంశాలను 90 శాతం నెరవేర్చామని ఐదేళ్లలో 20 ప్రతిష్ఠాత్మక సంస్థలను రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందని.. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రూ.180 కోట్లు గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌ లక్ష కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెడుతుండగా కోస్తా ప్రాంతంలో రూ.55,475 కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోందని చెప్పారు. చంద్రబాబు, జగన్‌ లతో ఏపీ అభివృద్ధి జరగదని టీడీపీ, వైసీపీలు వారి కుటుంబ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాయని రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలూ కుటుంబ, అవినీతి పార్టీలంటూ నిప్పులు చెరిగారు. బీజేపీతోనే ఆంధ్ర అభివృద్ధి చెందుతుందని వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.పుల్వామా ఘటనపై చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు షా. చంద్రబాబుకు పాక్‌ ప్రధాని పై ఉన్న నమ్మకం మన ప్రధాని మీద లేదన్నారు.