జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాముఖ్యాన్ని చాటి చెప్పేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భాజపాయేతర కూటమిని ఏర్పాటు చేసేందుకు జాతీయ స్థాయి నేతలతో మంతనాలు జరుపుతున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్,ఎల్జేడి అధ్యక్షుడు శరద్ యాదవ్ ను కలిన ఆయన కేంద్రం ఏపీపై చూపుతున్న వివక్షపై చర్చించారు.అనంతరం బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా భేటీ అయ్యారు. అలాగే తాజాగా యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అఖిలేష్ బీజీపేయేతర భావజాలమున్న పార్టీలన్నీ ఏకతాటిపైకి తీసుకురావాలని చంద్రబాబుని కోరారు. ఈ విషయంలో చంద్రబాబుకు తమ మద్దతు ఉంటుందని అఖిలేష్ తెలిపినట్టు సమాచారం.
ఈ నేపధ్యంలోనే ‘సేవ్ నేషన్’ పేరుతో భాజపాయేతర పార్టీలన్నింటనీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు మరోమారు ఢిల్లీకి వెళ్తున్నారు. ఇదే అంశం గురించి చంద్రబాబు సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసిన కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌తో భేటీ అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. రేపటి ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు రాహుల్‌ను కలిసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. భాజపాయేతర కూటమి ఏర్పాటుపై ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు రాహుల్‌తో భేటీ కానున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తదితరులతో భేటీ కానున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా ఈ భేటీ కీలకం కానుంది.