సీసీటీవీలో బాలుడి చివ‌రి క్ష‌ణాలు

cctv-footage-shows-last-moments-of-pradyuman

Posted September 14, 2017 at 13:46 

గురుగ్రామ్ లోని రేయాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్లో దారుణ హ‌త్య‌కు గురైన ఏడేళ్ల బాలుడు ప్ర‌ద్య‌మ్న చివ‌రి క్ష‌ణాలు సీసీటీవీలో రికార్డ‌య్యాయి. ముందు ప్ర‌ద్యుమ్న టాయ్ లెట్ లోకి వెళ్లాడు. కొద్ది క్ష‌ణాల త‌ర్వాత బ‌స్సు కండ‌క్ట‌ర్ అశోక్ కుమార్ కూడా అదే టాయిలెట్ లోకివెళ్లాడు. కాసేప‌టికే ప్ర‌ద్యుమ్న ఒంటినిండా ర‌క్తంతో టాయిలెట్ నుంచి పాకుతూ బ‌య‌ట‌కు వ‌చ్చి డోర్ ద‌గ్గ‌ర ప‌డిపోయాడు. ప్ర‌ద్యుమ్న శ‌రీరం నుంచి స్ర‌విస్తున్న ర‌క్తం అక్క‌డి గోడ‌ల‌కు కూడా అంటుకుంది. ఆ త‌ర్వాత కొన్ని నిమిషాల‌కు ర‌క్త‌పు మ‌డుగులో ఉన్న ప్ర‌ద్యుమ్న‌ను గుర్తించారు. కానీ అప్ప‌టికే ఆ చిన్నారి చ‌నిపోయాడు.

కేసు ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ల‌ను ప‌రిశీలించారు. ప్ర‌ద్యుమ్న హ‌త్య క్ష‌ణాల్లో జ‌రిగిపోయింద‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌ద్యుమ్న మెడ‌పై రెండు బ‌ల‌మైన క‌త్తిపోట్లు ఉన్నాయ‌ని, దాడి జ‌రిగిన రెండు నిమిషాల‌కే బాలుడు మృతిచెందాడ‌ని పోస్టు మార్టం నివేదిక‌లోనూ తేలింది. గొంతు వ‌ద్ద న‌రాలు తెగిపోవ‌డంతో ప్ర‌ద్యుమ్న కేకేలు వేయ‌లేక‌పోయాడ‌ని నివేదిక‌లో వెల్ల‌డ‌యింది. ఈ కేసులో నిందితుడు అశోక్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. తానే ఈ హ‌త్య చేసిన‌ట్టు విచార‌ణ స‌మ‌యంలో అశోక్ కుమార్ ఒప్పుకున్న‌ట్టు స‌మాచారం.

మ‌రోవైపు రేయాన్ స్కూల్లోనే చ‌దువుతున్న ప్ర‌ద్యుమ్న అక్క‌కు ఇంట‌ర్ వ‌ర‌కు ఫ్రీ ఎడ్యుకేష‌న్ అందిస్తామ‌ని యాజ‌మాన్యం ప్ర‌తిపాదించింది. దీనికి ప్ర‌ద్యుమ్న తండ్రి నిరాక‌రించాడు. అసలు త‌మ కూతురును రేయాన్ స్కూల్ నుంచి మాన్పించేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. త‌మ్ముడి మ‌ర‌ణాన్ని త‌మ కుమార్తె జీర్ణించుకోలేక‌పోతోంద‌ని… ఆ జ్ఞాప‌కాల‌తోనే బాధ‌ప‌డుతోంద‌ని… వీలైనంత త్వ‌రగా ఆమెను వేరే స్కూల్లో చేర్పిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

SHARE