Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా కీర్తిసురేశ్ తో మహానటి తీస్తున్నామని చిత్రయూనిట్ ప్రకటించగానే… అందరూ పెదవి విరిచారు. కళ్లతోనే నవరసాలు పలికించగల సావిత్రి పాత్రకు కీర్తి సురేశ్ లాంటి సాధారణ హీరోయిన్ ఎలా సరిపోతుందనుకున్నారు. పెద్దగా నటనానుభవం లేని కీర్తి సావిత్రిలా అలవోకగా నటించగలదా అని సందేహపడ్డారు. ఈ సందేహాలన్నింటికీ తన నటనతోనే సమాధానమిచ్చింది కీర్తి సురేశ్. మహానటి సినిమా ఆవిష్కరించింది… సావిత్రి జీవితాన్నే కాదు… కీర్తిసురేశ్ నటానాప్రతిభను కూడా. మహానటి ఫస్ట్ షోతోనే కీర్తిసురేశ్ టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. సాధారణ ప్రేక్షకుల నుంచీ సినీ ప్రముఖులు దాకా అందరూ ఇప్పుడు కీర్తిసురేశ్ గురించే మాట్లాడుకుంటున్నారు.
మహానటిలో కీర్తిసురేశ్ కనపడలేదని, సావిత్రే తెరపై ఉన్న అనుభూతి కలిగిందంటూ వినిపిస్తోన్న ప్రశంస చాలు… కీర్తి మహానటిగా ఎలా ఒదిగిపోయిందో తెలుసుకోడానికి. కీర్తిసురేశ్ కి ప్రేక్షకులు ఇప్పుడు వందకు వందా మార్కులు వేస్తున్నారు. సావిత్రి వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం, జెమినీ గణేశన్ తో ప్రేమ, పెళ్లి, ఆయన నిర్లక్ష్యంతో వేదనకు గురవడం, అయినవాళ్లే మోసం చేసినప్పుడు పడిన బాధ వంటి సందర్భాల్లో కీర్తిసురేశ్ నటన అద్భతమని అంతా కొనియాడుతున్నారు. కీర్తి సురేశ్ కెరీర్ మహానటికి ముందూ తర్వాతా అన్నట్టుగా మారిపోనుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
ప్రముఖులు అనేకమంది ట్విట్టర్ లో మహానటిసినిమా పైనా, కీర్తిసురేశ్ పైనా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తిసురేశ్ నటించిన తీరు అద్భుతమని, ఇలాంటి ప్రదర్శనను ఇప్పటివరకూ తానెప్పుడూ చూడలేదని, ఇది కేవలం ఇమిటేట్ చేయడమే కాదని, లెజెండరీ నటికి ఆమె మళ్లీ జీవం పోశారని ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రశంసించారు. దుష్కర్ సల్మాన్ అద్భుతంగా నటించారని, ఇప్పటినుంచి తాను ఆయనకు అభిమానినని చెప్పారు. కీర్తిసురేశ్ కు పాదాభివందనమని ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. మధురవాణి..సమంత..నన్ను ఏడిపించావ్..అన్నారు. వారితో పాటు పలువురు ప్రముఖులు మహానటిని ప్రశంసించారు.