ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చిన కేంద్రం…!

AP CM Chandra Babu Inmates At Delhi

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు పచ్చగడ్డు వేస్తే భగ్గుమనే పరిస్థితి. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పని చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసింది. ఇక అప్పటి నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రం కొర్రీలు పెడుతూనే వస్తోంది. అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోగా, కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వే జోన్ సహా విభజన చట్టంలోని పలు హామీలను లైట్ తీసుకుంది. అందుకే టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తూనే ఉన్నారు. వీటన్నింటిపై లిఖిత పూర్వకంగా సమాధానాలు చెప్పిన మోదీ సర్కారు తాజాగా మరో అంశంపై క్లారిటీ ఇచ్చి ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చింది. అదే విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచే విషయంలో సమాధానం చెప్పింది. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలంటూ చ‌ట్టంలో ఉంది. ఆంధ్రాలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల‌ను 225కి, తెలంగాణ‌లో ఉన్న 119 స్థానాల‌ను 153కి పెంచాల‌ని చ‌ట్టంలో పేర్కొన్నారు. కానీ, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఆశలపై కేంద్రం నీళ్లు జల్లింది. సీట్ల పెంపు ఇప్పుడే సాధ్యం కాదని తేల్చిచెప్పింది.

రాజ్యసభలో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అడిగిన ఓ ప్రశ్నకు 2026 తర్వాత చేసే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ అహీర్‌ స్పష్టం చేశారు. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ఇదే అంశంపై కేంద్రలో కదలిక వచ్చింది. గతంలో దీన్ని పెండింగ్‌లో పెట్టిన కేంద్ర హోం శాఖ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. అప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కేంద్ర నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ కే ప్రయోజనం చేకూరుస్తుందని అంతా భావించారు. కానీ, ఇప్పుడు ఏమైందో ఏమో మళ్ళీ వెనక్కి తగ్గిన కేంద్రం ఇప్పుడు మళ్ళీ మాట మార్చింది. 2014లో విజయం సాధించిన తర్వాత కేసీఆర్, చంద్రబాబులు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ, నేతలను తమ పార్టీల్లోకి రప్పించుకోగలిగారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లు సీట్ల పెంపు జరిగితే వాళ్లందరికీ టికెట్లు ఇవ్వవచ్చని ఇద్దరూ భావించారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు కూడా ముగియడంతో ఒకవేళ సీట్ల పెంపు జరిగితే ఏపీకి ప్లస్ అవుతుందనుకుంటున్న సమయంలో కేంద్రం ప్రకటన అధికార పార్టీని షాక్‌కు గురి చేసింది. దీంతో ఈసారి టిక్కెట్ల రచ్చ మామూలుగా ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు.