ఛలో… తెలుగు బులెట్ రివ్యూ

Chalo Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :    నాగ శౌర్య, రష్మిక మందన 
నిర్మాత:     ఉష ముల్పూరి 
దర్శకత్వం :   వెంకీ కుదుముల 
సినిమాటోగ్రఫీ:   సాయి శ్రీరామ్ 
ఎడిటర్ :   కోటగిరి వెంకటేశ్వరరావు 
మ్యూజిక్ :   మహానటి స్వర సాగర్ 

నాగ శౌర్య ఈ తరం హీరోల్లో ఒకడు. అయితే ఊహలు గుసగుసలాడే అనే ప్రామిసింగ్ సినిమా తర్వాత ఆ మధ్య వచ్చిన జ్యో అచ్యుతానంద మధ్య ఆయన కెరీర్ గాడితప్పింది. ఆ రెండు సినిమాలు ఇచ్చిన సక్సెస్ ఎల్లకాలం వెంట ఉండాలంటే కధల ఎంపిక ,నిర్మాణ విలువల విషయంలో మొహమాటానికి పోకూడదని నాగ శౌర్య గట్టిగా అనుకున్నారు. అందుకే ఆయన తన కెరీర్ ని గాడిలో పెట్టుకోడానికి తానే పూనుకున్నారు. సొంత కుటుంబం అండతో “ఛలో” సినిమా నిర్మాణానికి ఓకే చెప్పాడు. ఇక దర్శకుడుగా Teja ,త్రివిక్రమ్ ల దగ్గర పనిచేసిన వెంకీ కుడుముల ని ఎంపిక చేసుకున్నాడు. “అ ఆ” సినిమా సెకండ్ యూనిట్ దర్శకుడుగా పనిచేసిన వెంకీ ఛలో తో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఈ తరం హీరో ,దర్శకుడు కలిసి “ఛలో “ అంటూ చేసిన వెండితెర ప్రయాణం ఎలా వుందో చూద్దాం.

కథ…

చిన్నప్పుడు ఏడిచే పిల్లవాడిని అది మానిపించడానికి ఏదోలా మాయ చేస్తాం. హీరో తండ్రి ( సీనియర్ నరేష్ ) మాత్రం ఆ పిల్లవాడితో ఎదుటివాళ్ళని కొట్టిపించి నవ్వేలా చేస్తాడు. పెరిగేకొద్దీ ఆ పిల్లవాడితో ఆ అలవాటు కూడా పెరిగిపోతుంది. కొట్టడమే కాదు ,కొట్టించుకున్నా హ్యాపీ గా ఫీల్ అయ్యే స్థితికి హీరో హరి ( నాగ శౌర్య ) వచ్చేస్తాడు . ఈ పరిణామాలతో భయపడ్డ అతని తల్లిదండ్రులు అతనిలో మార్పు కోసం ఓ ప్రయత్నం చేస్తారు. నిత్యం గొడవలు జరిగే చోటుకు పంపితే ఆ కుర్రోడిలో మార్పు వస్తుందని భావిస్తారు. ఆలా హరి ఆంధ్ర ,తమిళనాడు సరిహద్దుల్లోని తిరుప్పురం అనే వూళ్ళో ఇంజనీరింగ్ చదవడానికి వచ్చిపడతాడు. తమిళులు ,తెలుగోళ్లు నిత్యం ఒకరి మీద ఇంకొకరు దాడులు చేసుకునే ఆ ఊరిలోకి ఎంటర్ అవుతూనే అక్కడి పరిస్థితి హీరోకి అనుభవం అవుతుంది. అయితే కాలేజీ లో తమిళులు అతన్ని తమిళ్ వాడు అనుకుని తమతో కలుపుకుంటారు. అక్కడే ఓ తమిళ్ అమ్మాయితో హీరో ప్రేమలో పడతాడు. దీంతో ఆ కుటుంబం అర్జెంటు గా హీరోయిన్ కి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతుంది. హీరోయిన్ మాత్రం ఆ వూళ్ళో తమిళ్ ,తెలుగు గొడవలు లేకుండా చూసి తనని అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలి అని కోరుతుంది. అందుకోసం హీరో ఏమి చేసాడు , చివరికి ఏమి జరిగింది అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ …

ఓ కొత్త దర్శకుడు సినిమా అనుకోగానే కొత్తదనం ఆశిస్తాం లేదా తెలిసిన విషయంలో బాగా పట్టు ఉందేమో చూస్తాం. ఇక్కడ వెంకీ కుడుముల రెండో పద్ధతిలో తనను తాను ప్రెజంట్ చేసుకోడానికి “ఛలో “ సినిమాని ఎంచుకున్నాడు. వినోదం అనే బాటలో ప్రయాణానికి రెడీ అయ్యాడు. సినిమా తొలి సీన్ నుంచి ఇంటర్వెల్ దాకా వచ్చిన ప్రతి సీన్ ( డైలాగ్స్ తప్ప ) ఊహించడానికి వీలున్నవే. అయితే పాలు,పంచదార , డికాక్షన్ కరెక్ట్ గా వేసి మంచి కాఫీ పెడితే రోజూ అయినా బోర్ కొట్టకుండా ఎలా ఉంటుందో అలాగే రొటీన్ అనిపించినా ఫస్ట్ హాఫ్ లో వినోదానికి కొదవలేదు. సెకండ్ హాఫ్ కూడా ఇలాగే నడిపించాలని చూసినా హీరో , హీరోయిన్ ఎడబాటు కి సంబంధించిన కీలక ఘట్టం ముందుగానే తెలియడం, అసలు సస్పెన్స్ చివరిదాకా రెవీల్ కాకుండా కాపాడాల్సి రావడంతో ఆ మధ్య కధనం నెమ్మదించింది. చివరకు క్లయిమాక్స్ లో చెప్పిన విషయం కూడా కొందరికి సీరియస్ నెస్ తగ్గించినట్టు అనిపించొచ్చు. కానీ నిజానికి కాస్త లోతుగా ఆలోచిస్తే ఒకప్పుడు ఇలాంటి విషయాలకు పగలు,ప్రతీకారాలు తోడు అయ్యాయి అని ఒప్పుకుంటాం. ఇక హీరో వ్యక్తిత్వానికి సంబంధించి ఇండియన్ పేరెంటింగ్ ఎలా వుందో సరదాగా చూపించేసాడు దర్శకుడు. ఈ విషయాలు పైకి ఆలా తేలిగ్గా అనిపించినా సీరియస్ గా ఆలోచించాల్సినవి. కానీ ముందు అనుకున్నట్టు దర్శకుడు వినోదాల దారిలో నవ్వుల రధం ఎక్కి ఛలో అనదలచుకున్నప్పుడు ఇలాగే ఉంటుంది అని అంగీకరించాలి. నిజానికి చాలా పెద్ద విషయాలు అనుకున్నవి దగ్గరగా చూస్తే సరళంగా అనిపిస్తాయి.

హీరో నాగ శౌర్య ఎప్పటిలాగానే బాగా చేసాడు. హీరోయిన్ అందం కన్నా నటన డామినేట్ చేసింది. మిగిలిన నటీనటుల్లో సత్య , రఘు బాబు , తిరుప్పురం ఊరిలో పెద్దలు పాత్రలు వేసిన వాళ్ళు అంతా బాగా చేశారు. సాంకేతిక నిపుణుల పనితనం సినిమాకు తగ్గట్టు వుంది.

ప్లస్ పాయింట్స్ …
కామెడీ
డైలాగ్స్
హీరో ,హీరోయిన్ సహా నటీనటులు
మైనస్ పాయింట్స్ ..
సెకండ్ హాఫ్ లో కధనం
తెలుగు బులెట్ పంచ్ లైన్ …సరదాగా టైం పాస్ చేద్దాం అనుకుంటే “ఛలో “ అని వెళ్లిపోవచ్చు. అంతకు మించి ఊహిస్తే …
తెలుగు బులెట్ రేటింగ్ …2 .75 /5 .