Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన చాందినీ జైన్ హత్యకేసును పోలీసులు చేధించారు. ఆమె స్నేహితుడు సాయికిరణ్ రెడ్డి ఈ హత్య చేసినట్టు నిర్ధారించారు. మియాపూర్ మదీనగూడలోని సత్యనారాయణ ఎన్ క్లేవ్ కు చెందిన హోల్ సేల్ వస్త్ర వ్యాపారి కిషోర్ జైన్ కుమార్తె 17 ఏళ్ల చాందినీ చైన్. ఈ నెల 9వ తేదీ సాయంత్రం నుంచి కనిపించలేదు.స్నేహితులను కలిసి వస్తానని వెళ్లిన చాందినీ రాత్రి గడుస్తున్నా ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. మూడు రోజుల తర్వాత అమీన్ పూర్ గుట్టల్లో ఆమె శవమై కనిపించింది.
ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అదృశ్యమైనరోజు చాందినీ ఓ యువకుడితో కలిసి ఆటోలో వెళ్లినట్టు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులు పలువురిని విచారించారు. చివరకు స్నేహితుడు సాయికిరణ్ చాందినీని అమీన్ పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లి హత్యచేసినట్టు తేల్చారు. ఆరవ తరగతి నుంచి స్నేహితులైన సాయికిరణ్, చాందినీ పదోతరగతి తర్వాత వేర్వేరు కాలేజీల్లో చేరారు. తామిద్దరమూ తొమ్మదోతరగతి నుంచే ప్రేమించుకుంటున్నామని, ఆమెను హత్య చేయాలన్న ఉద్దేశం తనకు లేదని, క్షణికావేశంలో ఈ పనిచేశానని సాయి కిరణ్ చెప్పాడు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరన్న భయంతో కొంతకాలం నుంచి చాందినిని దూరం పెట్టానని, కానీ ఆమె పెళ్లిచేసుకోమంటూ వెంటపడుతోందని..అది భరించలేకనే హత్యచేశానని అంగీకరించాడు. అమీన్ పూర్ గుట్టల దగ్గరకు వెళ్లిన తర్వాత తనకు, చాందినీకి గొడవ జరిగిందని, కోపంతో ఆమెను తలమీద, మెడపైనా బలంగా కొట్టానని.. సాయికిరణ్ తెలిపాడు.
సాయి కిరణ్ ను సంఘటనా స్థలానికి తీసుకువెళ్లిన పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ ద్వారా హత్య జరిగిన తీరును తెలుసుకున్నారు. చాందిని హత్యకు ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని పోలీసులు తెలిపారు. విచారణ సమయంలో సాయికిరణ్ చాందిని హత్య జరిగిన టైంలో తాను క్రికెట్ ఆడుతున్నానని చెప్పాడని, దీనిపై అతని స్నేహితులను విచారించగా…సాయికిరణ్ కు క్రికెట్ ఆడే అలవాటు లేదని వారు చెప్పారని, దీంతో అతడు దొరికిపోయాడని పోలీసులు తెలిపారు. పిల్లలను తల్లిదండ్రులు పర్యవేక్షిస్తుండాలని పోలీసులు సూచించారు. చాందినీ సోషల్ మీడియా అధికంగా ఉపయోగించేదని, ఈ ప్రభావం కూడా బాలికపై ఉందని పోలీసులు విశ్లేషించారు.
మరిన్ని వార్తలు:
సంపన్న నేరస్థుల్లో రెండో స్థానంలో దావూద్
సింగపూర్ కు మహిళా అధ్యక్షురాలు