రాజ‌కీయం అంటార‌నే నాలుగేళ్లు ఓపికప‌ట్టాం….

Chandra Babu Comments On Central Government On AP Special Status

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఏపీకి రావాల్సిన నిధుల కోసం తొలి బ‌డ్జెట్ లోనే గొడ‌వ పడితే రాజ‌కీయం అంటార‌నే ఇన్నాళ్లూ ఆగామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు స్ప‌ష్టంచేశారు. తాజా రాజ‌కీయప‌రిణామాల‌పై టీడీపీ ఎంపీలు, మంత్రులు, పార్టీ ప్ర‌చార‌సారధుల‌తో నిర్వ‌హించిన టెలికాన్ఫ‌రెన్స్ లో అనేక విష‌యాల‌పై చంద్ర‌బాబు మాట్లాడారు.

ఏపీకి కేంద్రం న్యాయం చేస్తుంద‌న్న ఆశ‌తో నాలుగు బ‌డ్జెట్ ల్లో ఎదురుచూశామ‌ని, నాలుగేళ్ల‌గా పోరాడుతున్నా..29 సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రాన్ని ఆదుకోమ‌ని కోరినా ఎలాంటి స్పంద‌నా  లేక‌పోవ‌డం వ‌ల్లే కేంద్ర ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, ఎన్డీఏ నుంచి వైదొలిగామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. ఏపీకి నిధులు రాబ‌ట్టేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు పూర్త‌యిన త‌ర్వాతే, విధిలేని ప‌రిస్థితుల్లో పోరాట‌మార్గం ప‌ట్టామ‌ని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా లేఖకు  అసెంబ్లీలోనే స‌మాధాన‌మిచ్చామ‌ని, బీజేపీతో పొత్తు పెట్టుకుందే రాష్ట్ర ప్రయోజ‌నాల కోస‌మ‌ని అన్నారు. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు అనుగుణంగా తాము అడ‌గ‌డం బీజేపీకి న‌చ్చ‌డం లేద‌న్నారు.

ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వ‌డం లేద‌ని చెప్పిన కేంద్ర‌ప్ర‌భుత్వం, ఈశాన్య  రాష్ట్రాల‌కు 90ః10 నిధులు కొన‌సాగిస్తున్నార‌ని, జీఎస్టీలో కూడా ఈశాన్య రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక ల‌బ్ది చేకూరుస్తున్నార‌ని, అలాగే ఏపీకి ఎందుకు ఇవ్వ‌ర‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల‌న్నింటికీ యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్ ఇచ్చామ‌ని, యూసీలు ఇవ్వ‌నందునే నిధులు ఆపామ‌ని కేంద్రం చెప్ప‌డం ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని, దుర్మార్గ‌మ‌ని మండిప‌డ్డారు. యూసీలు ఇవ్వ‌లేద‌ని రుజువు చేస్తే త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని సీఎం ర‌మేశ్ స‌వాల్ విస‌ర‌గా, బీజేపీ నేత జీవీఎల్ వెన‌క్కి త‌గ్గిన విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు.

ఆర్థిక లోటుకు యూసీలు ఇవ్వాల్సిన అవ‌స‌రంలేద‌ని,  వెన‌క‌బ‌డిన జిల్లాల‌కు ఇచ్చిన రూ. 1500 కోట్ల‌లో రూ. 940కోట్ల‌కు యూసీలు ఇచ్చామ‌ని,అదేవిధంగా అమ‌రావ‌తికిచ్చిన రూ. 1000 కోట్ల‌కు, గుంటూరు, విజ‌య‌వాడ‌కు ఇచ్చిన నిధుల్లో రూ.350 కోట్ల‌కు యూసీలు ఇచ్చామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. బీజీపీ చేస్తున్న అస‌త్య ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొట్టాల‌ని, ఏపీకి చేసిన అన్యాయాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని నేత‌ల‌కు సూచించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం స‌హ‌క‌రించాల‌ని, అదే విధంగా ప్ర‌జ‌ల సెంటిమెంట్ గౌర‌వించాల‌ని కేంద్రానికి హిత‌వు ప‌లికారు.

ప్ర‌జ‌ల‌కోసం పోరాడే ముఖ్య‌మంత్రి ప‌క్షాన ఉంటారా లేక రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రం ప‌క్షాన ఉంటారా అన్న విష‌యాన్ని ఆయా పార్టీల నేత‌లే తేల్చుకోవాల‌ని, టీడీపీకి మ‌ద్ద‌తు ఇస్తే రాష్ట్రానికి ఇచ్చిన‌ట్టే న‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. వైసీపీతో కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపైనా చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. విజ‌య్ మాల్యా, విజ‌య‌సాయిరెడ్డి ఇద్ద‌రూ ఆర్థిక నేర‌స్థులే అని, వారి మ‌ధ్య వ్య‌త్యాస‌మేమీ లేద‌ని, మ‌రి అలాంట‌ప్పుడు విజ‌య్ మాల్యాకు  ఓ న్యాయం, విజ‌య్ సాయిరెడ్డికి మ‌రో న్యాయ‌మా అని ప్ర‌శ్నించారు.

విజ‌య్ మాల్యా దేశం విడిచి పారిపోయాడ‌ని, విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యంలో ఉంటున్నార‌ని మండిప‌డ్డారు. టీడీపీపై బీజేపీ నేత‌లు కావాల‌నే ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, త‌మ‌పై ఉన్న అవినీతి ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌ని బీజేపీ టీడీపీపై ఆరోప‌ణ‌లు చేయ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.