Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పోలవరం మీద ప్రతి సోమవారం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించేవారు. 2019 కన్నా ముందే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలని బాబు ఉవ్విళ్ళూరారు. దానికి తగ్గట్టే పోలవరం పని పరుగులెత్తించారు. లేనిపోని కొర్రీలతో పోలవరం పనులు ఆగుతాయన్న సందేహం రాగానే ఎన్నడూ లేనిది కేంద్రంతో తలపడేందుకు కూడా సిద్ధం అయ్యారు. దీంతో పోలవరం కేంద్రంగా టీడీపీ , బీజేపీ మధ్య రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఇదంతా గుజరాత్ ఎన్నికల ఫలితాలు రాకముందు అన్న విషయం నోట్ చేసి పెట్టుకోవాలి.
పోలవరం గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేని బీజేపీ నాయకులు ఢిల్లీ వెళ్లడం, ఉప రాష్ట్రపతి వెంకయ్య కార్యాలయంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ కావడం కాకతాళీయం కానే కాదు. నిజానికి ఈ భేటీ చంద్రబాబు వున్నప్పుడు జరిగితే దీని గురించి అనుకోవాల్సి పనిలేదు. నిర్మాణ బాధ్యతలు రాష్ట్రానికి అప్పగించిన కేంద్రం కూడా తమకు చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడుతోంది అనుకునే ఛాన్స్ ఉండేది. చంద్రబాబు లేని టైం లో ఢిల్లీలో బీజేపీ నేతల సమక్షంలో పోలవరం సమీక్ష జరగడం, ఆపై ఇక పోలవరం బాధ్యత నాది అని గడ్కరీ చెప్పడం చూస్తుంటే ఇక ప్రాజెక్ట్ పనుల్లో కేంద్రం జోక్యం ఎక్కువ అవుతోందని చెప్పుకోవచ్చు. జోక్యానికి తగినట్టు పనులు అయితే బీజేపీ నేతలు ఆశించినట్టు రాజకీయంగా ఆ పార్టీ మీద ఏపీ ప్రజల్లో ప్రేమ పుట్టకపోయినా ఉన్న కోపం కాస్త అయినా తగ్గుతుంది. కానీ అదే సమయంలో పోలవరం,రాజధాని అమరావతి అనే రెండే అస్త్రాలను వచ్చే ఎన్నికలకు ప్రధానంగా ఎంచుకున్న చంద్రబాబు చేతుల్లో నుంచి ఒక పవర్ ఫుల్ ఆయుధం చేజారినట్టే.