ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా విభజన చట్టం అమలుపై సభలో చర్చ జరిగింది. చర్చ సందర్బంగా అసెంబ్లీ దద్దరిల్లింది. బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ కేంద్రం చాలానే ఇచ్చిందని లెక్కలు చెబుతుంటే చంద్రబాబు మధ్యలో అడ్డుకున్నారు. విష్ణుకుమార్ రాజు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర సంస్థలు ఎవరి కోసం ఇస్తారని ఎవడబ్బ సొమ్మని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా ఉండటానికి విష్ణుకుమార్ రాజుకు అర్హత లేదని రక్తం ఉడికిపోతుందన్నారు. ఎవరికి ఊడిగం చేస్తారు ? ఏం చేస్తారయ్యా మీరు ? జైల్లో పెడతారా ఆవేదన ఉండదా మాకు ? తమిళులకి ఎన్ని ఇచ్చారు ? గుజరాత్‌కి ఎన్ని ఇచ్చారు.? రోషం లేదా? తమాషాగా ఉందా న్యాయం జరిగేంత వరకు వదిలి పెట్టం. వినేవాళ్లు ఉంటే చెవుల్లో పువ్వులు పెడతారండి. మహిళలు వచ్చి.. పోరాడతామంటున్నారని.. పెన్షన్ డబ్బులు విరాళంగా ఇస్తున్నారని .. ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా అని అడుగుతున్నారని.. సాధారణ మహిళలకు ఉండే పరిజ్ఞానం మీకు లేదా’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవితంలో తొలిసారి నల్లచొక్కా ధరించి నిరసన తెలుపుతున్నానని చంద్రబాబు అన్నారు. అన్నీ ఇచ్చిన జన్మభూమి కోసమే నల్లచొక్కా వేసుకున్నానని చివరి బడ్జెట్లోనైనా ఏమైనా చేస్తారా అని చూస్తుంటే.. ఏమీ ప్రకటించలేదన్నారు. బీజేపీ నేతలకు ఏపీ కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఇండియా మ్యాప్ నుంచి ఏపీని తీసేస్తారేమోనని, ఇవాళ్టి అన్యాయానికి పూర్తిస్థాయిలో బీజేపీదే బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదాపై తాను మాట మార్చలేదని కేంద్రమే తప్పుడు సమచారమిచ్చి అన్యాయం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. 14వ ఆర్థిక సంఘం పేరుతో మోసం చేశారని ఆ సంఘం చైర్మన్ హోదాపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్వయంగా చెప్పారన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్యాకేజీ పేరు చెప్పిందన్నారు. డబ్బులు ఇవ్వండని అడిగితే అప్పు ఇస్తానంటున్నారని అప్పు ఇస్తే తాను సంపాదించుకోలేనా అని ప్రశ్నించారు. విభజన చేసిన కాంగ్రెస్ పుట్టగతులు లేకుండాపోయిందని గుర్తుచేసిన చంద్రబాబు నమ్మించి మోసం చేసిన బీజేపీకి కూడా ప్రజలు అంతకంటే పెద్ద శిక్ష వేస్తారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటారని, అసెంబ్లీకి మాత్రం రారని విమర్శించారు. వైసీపీలో ట్రాప్‌లో పడ్డానని మోడీ అంటున్నారని మోడీనే అవినీతి పరుడి ట్రాప్‌లో పడ్డారని ఆయన అన్నారు. ఒక సీఎం కలవడానికి వెళితే సమయమివ్వరని కానీ 11 కేసుల్లో ఉన్నవారికి మాత్రం సమయం కేటాయిస్తారని విమర్శించారు. సౌత్ ఇండియాలో బీజేపీకి ఒక్క లీడర్ లేరని, ఉన్న ఒక్క వెంకయ్యనాయుడిని కేబినెట్ నుంచి పంపేశారని విమర్శించారు. అన్ని రాష్ట్రాల తిరిగే వెంకయ్యను ప్రభుత్వం నుంచి పక్కన పెట్టారని ఆయన అన్నారు. దక్షిణ భారత నేతలకు ఏం గౌరవం ఇచ్చారో బీజేపీ చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు.