Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో విభజన అనంతరం కూడా అప్పుడప్పుడూ ప్రాంతీయ వాదనలు వినిపిస్తూనే వున్నాయి.చంద్రబాబు సర్కార్ కి రాజధాని అమరావతి ప్రాంతం మీద వున్న ప్రేమ రాయలసీమ మీద లేదని ఒకరు,ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతోందని ఇంకొకరు చెప్పడం చూస్తూనే వున్నాం.ఈ వాదనల్ని తిప్పికొట్టడానికే టీడీపీ ప్రభుత్వం సతమతమవుతోంది. ఇంతలో ఓ అనూహ్యమైన విషయం ముందుకొచ్చింది.సాక్షాత్తు ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేనే రాజధాని ప్రాంతంలోనూ వివక్ష కొనసాగుతోందని ఓ వాదన ముందుకు తెచ్చారు.గుంటూరు లో ఎమ్మెల్యేగా వున్న మోదుగుల వేణుగోపాలరెడ్డి రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి గుంటూరుని చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు.
రాజధాని ఎంపిక సమయంలో విజయవాడకి దగ్గరగా ఉన్నప్పటికీ గుంటూరు జిల్లా లోనే ఎక్కువ భాగం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని విశ్లేషణలు వచ్చాయి.అయితే ఆ ప్రకటనకు,విశ్లేషణకు తగ్గట్టు విజయవాడతో సమానం గా గుంటూరు అభివృద్ధి చెందడం లేదని విమర్శలు ఎప్పటినుంచో వున్నాయి.నిజానికి దీనికి పెద్ద విశ్లేషణ కూడా అవసరం లేదు.వున్నది వున్నట్టుగా విజయవాడ,గుంటూరు లో ఓ రౌండ్ వేసి వస్తే సరి.రాజధాని రాకముందు ఇప్పటికి విజయవాడలో చెప్పుకోదగ్గ మార్పులు కంటికి కనిపిస్తున్నాయి.గుంటూరు కి వచ్చేసరికి ఒక్క ఇన్నర్ రింగ్ దగ్గర తప్ప మిగిలిన విషయాల్లో అంత మార్పులేమీ ప్రస్తుతానికి కనిపించడం లేదు.అయితే కాలంతో పాటు అన్ని మారతాయని గుంటూరు వాసులు భావిస్తూ వచ్చారు.ఎన్నికల భయమో లేక వ్యక్తిగత అవసరమో గానీ గుంటూరు ప్రజల్లో వున్న అసంతృప్తి ఇప్పుడు మోదుగుల మాటలతో బయటపడింది.తొలిదశలోనే ఇలాంటి వాదనల్ని సమర్ధంగా తిప్పికొట్టకపోతే పరిస్థితి చేయి దాటడం ఖాయం.అయితే తిప్పికొట్టడం అంటే కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం కాదు.అభివృద్ధిలో విజయవాడకి దీటుగా గుంటూరుని కూడా నడిపించడం.