ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 11న సోమవారం కేబినెట్‌ను విస్తరించాలని సీఎం భావిస్తున్నారు. ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగిన తర్వాత రాష్ట్రంలోని ఇద్దరు బీజేపీ మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు తప్పుకొన్నారు. దీంతో ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. కామినేని శ్రీనివాస్ నిర్వహించిన వైద్య, ఆరోగ్య శాఖను చంద్రబాబు చూస్తున్నారు. దేవాదాయ శాఖను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి అప్పగించారు. అయితే, ఈ రెండు ఖాళీలే ఉన్నా, వీటికోసం ఎదురు చూస్తున్న ఆశావహుల లిస్ట్ మాత్రం చాలా పెద్దదే ఉంది.ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం రెండు పదవుల్లో ఒకటి మైనారిటీలకు, మరొకటి ఎస్టీలకు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.
మైనారిటీ కోటాలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్, శాసనమండలి చైర్మన్ ఎన్‌ఎండీ ఫరూక్ రేసులో ఉన్నారు. కామినేని శ్రీనివాస్ కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి, జిల్లా కోటా కింద తనకు అవకాశం దక్కుతుందని విజయవాడకు చెందిన జలీల్ ఖాన్ ఆశలు పెట్టుకున్నారు. ఇక నంద్యాల ఎన్నికల్లో తన పనితనం చూసి ఈ పదవి తనకే ఇస్తారని ఫరూక్ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన షరీఫ్ కి పార్టీ అత్యంత విధేయుడు,, అత్యంత సౌమ్యుడు అన్న పేరుంది దీంతో ఆయన పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. మంత్రి పదవిలో మరో ఖాళీని గిరిజనులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సమాచారం. అందుకు కూడా గట్టి పోటీ ఉంది. వైసీపీని వీడి టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరి కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇంతకు ముందు ఆమెకు కిడారి సర్వేశ్వరరావు పోటీ ఉండేవారు. కానీ, మావోయిస్టుల చేతిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
కిడారి కుటుంబాన్ని పరామర్శించిన సమయంలో ఆయన కుమారుడు శ్రావణ్‌కు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఆ లెక్కన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కిడారి కుమారుడికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరోపక్క పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు కూడా ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే ఆయన. ఆ తర్వాత వైసీపీ నుంచి కొందరు గిరిజన ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. అయితే, తనకూ ఓ చాన్స్ వస్తుందని మొడియం శ్రీనివాసరావు ఆశలు పెట్టుకున్నారు. కొత్తగా ఇద్దరిని తీసుకోవడంతోపాటు మంత్రివర్గంలో మరికొన్ని మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద మరింత క్లారిటీ వచ్చేది మాత్రం ఎల్లుండే.