Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో కాకలు తీరిన పలువురు నేతలు బీజేపీ తీరును తప్పుబడుతున్నారు. బీజేపీ తీరు సరైనది కాదనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు. క్యాబినెట్ మీటింగ్ లో కర్నాటక విషయం ప్రస్తావనకు రాగా…చంద్రబాబు దీనిపై స్పందించారు. బీజేపీ తీరు సరికాదని, ఆ పార్టీ పదే పదే తప్పులు చేస్తోందని, ఏమాత్రం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, జేడీఎస్ వైఖరీ సరైన విధంగా లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆ రెండు పార్టీల నేతలు పోరుబాట ఎంచుకోలేదని, రాజ్ భవన్ ముందు బైఠాయించి, అక్కడే స్నానపానాదులు కానిచ్చి జాతీయ మీడియా దృష్టినాకర్షించి దేశమంతా చర్చ జరిగేలా చేస్తే బాగుండేదన్నారు. గవర్నర్ కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిఉండాల్సిందన్నారు.
కర్నాటక ఫలితాలు సమీక్షిస్తే…తెలుగువారి ఓట్లు బీజేపీకి రాలేదని తెలిసిపోతుందన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా బీజేపీపై విరుచుకుపడ్డారు. రాజకీయ విలువలకు బీజేపీ పూర్తిగా తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు. కర్నాటకలో ఆ పార్టీ చేస్తున్న నీచమైన రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థను పరిహసించేలా ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం లేనప్పటికీ…గవర్నర్ ను అడ్డంపెట్టుకుని, దొడ్డిదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టువంటిదని దుయ్యబట్టారు. వాజ్ పేయి హయాంలో బీజేపీ నీతివంతమైన రాజకీయాలు చేసిందని, కేవలం ఒక్క ఓటు తక్కువైన నేపథ్యంలో వాజ్ పేయి ప్రధాని పదవినే వదిలేశారని, ఇప్పుడు మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారమే పరమావధిగా సాగుతోందని, అధికారం కోసం ఎంతకైనా దిగజారుతోందని విమర్శించారు. కేరళలో ఒక్కసీటు తక్కువ కావడంతో ప్రతిపక్షంలో కూర్చున్న గొప్ప చరిత్ర సీపీఐకి ఉందన్నారు.