రమణ దీక్షితుల వెనుక ‘ఆపరేషన్ గరుడ’

Operation Garuda behind Tirumala head Priest Ramana Deekshitulu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టీటీడీ అధికారులపైనా, ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపైన ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు, అధికారులు తమ స్వార్థం కోసం స్వామి వారి సేవల సమయాన్ని కుదించి, అర్చకులను బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారన్నారని అందుకే స్వామి వారి సేవలు, ఆరాధన తగ్గిపోయాయని, ఆగమ శాస్త్రంలో చెప్పినట్లు ఇటువంటి పిచ్చి చేష్టల వలన స్వామివారు ఆగ్రహానికి గురై మహాపరాదం జరుగుతుందన్నారు ఆయన. కేంద్ర ఎక్స్‌పర్ట్‌ కమిటీతో అతి ప్రాచీన ఆలయాలను కాపాడాలని, ఇందులో పురావస్తు, ఆగమ శాస్త్ర పండితులు, ఆభరణాల నిపుణులు, స్వామివారి సేవే పరమావధిగా కలిగిన పరిపాలన సీనియర్ అధికారులు ఉండాలన్నారు. ప్రదానార్చకుడిగా నాకే టీటీడీ ఆభరణాల వివరాలు తెలియటంలేదు… అన్యమతస్తుల విషయం రాజకీయాల విచక్షణకే వదిలేస్తున్నామన్నారు రమణ దీక్షితులు. ఏ చరిత్ర తెలియని పాలక మండలి, అధికారుల వలన ఆలయ ప్రతిష్ట మంట కలుస్తుందని, దీనిపై సీబీఐ విచారణ జరగాలని, అందులో భక్తుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని పేర్కొన్నారు.

అయితే ఆయన ఈ డిమాండ్స్ చేసిన 24 గంటలు గడవకముందే ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పై చర్య తీసుకున్నట్టు అయ్యింది. నిన్న జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి 65 ఏళ్లు పైబడిన అర్చకులందరికి రిటైర్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటికే 70 ఏళ్లకు చేరిన రమణదీక్షితులు ఉద్యోగ విరమణ తప్పక చేయని పరిస్థితి ఏర్పడింది. ఆయనతో పాటు మరో ముగ్గురు అర్చకులపై కూడా ఈ నిర్ణయ ప్రభావం పడనుంది. అయితే బోర్డు నిర్ణయం వెలువడిన తరువాత తిరుమలలో విలేకరులతో మాట్లాడిన రమణదీక్షితులు తనపై తీసుకున్న చర్యను చట్టపరంగానే ఎదుర్కుంటానని పేర్కొన్నారు. తాను చెన్నైలో విలేకరుల సమావేశం పెట్టి టీటీడీలో జరుగుతున్న చర్యలను విమర్శించినందుకు ప్రతీకారంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో ఈ ఆరోపణలపై రమణ దీక్షతులును సంజాయిషీ కోరాలని కూడా నిర్ణయించారని తెలుస్తోంది.

అయితే చెన్నైలో రమణదీక్షితులు విలేకరుల సమావేశం నిర్వహించడం వెనుక బీజేపీ ప్రమేయం ఉందన్న ప్రచారం మొదలయ్యింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) ఉరఫ్ సంఘ్ పరివార్‌ తన కార్యక్రమాలకు కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. టీడీపీతో మిత్ర పక్షంగా ఉన్న నాలుగేళ్ల కాలంలో తన మతతత్వ అజెండాను బీజేపీ చాపకింద నీరులా అమలు చేసిందని, టీటీడీలో ప్రధాన అధికారిని తమ ఉత్తారాది వ్యక్తిని నియమించుకోవడంతో పాటు, మఠాధిపతులకు, పీఠాధిపతులకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకొందని అయితే, తాజా రాజకీయ పరిణామాల వలన బీజేపీ, టీడీపీ ల మధ్య అంతరాలు పెరిగిన దృష్ట్యా. టీటీడీని పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవాలని కేంద్రం ప్రయత్నించడం, వెంటనే ప్రజాగ్రహానికి గురికావడం వంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీనే వ్యూహాత్మకంగా రమణదీక్షితులు చేత టీటీడీపై విమర్శలు చేయించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే రమణ దీక్షితులు వెనుక ఎవరున్నారో బయట పెట్టాలి అంటూ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వేమూరి ఆనందసూర్య డిమాండ్‌ చేశారు. ఆయన మరిన్ని అనుమానాలు అవ్యక్తం చేశారు రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలు ఈ నాలుగేళ్లలో ఉత్పన్నమైనవి కావని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా తిరుపతిలో సిలువ స్తంభాలు పెడుతున్నప్పుడు దీక్షితులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. నాస్తికుణ్ని టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా నియమించినప్పుడు ఎందుకు ప్రశ్నించ లేదని ? ఏపీపై అంతర్గతంగా, బహిర్గతంగా సాగుతున్న ఆపరేషన్‌ గరుడ కుట్రలో భాగంగానే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారేమోననే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు.

అయితే ఆనంద్ సూర్య వ్యాఖ్యలు చూస్తుంటే ఇది నిజంగా ఆపరేషన్ గరుడలో భాగంగానే చేసిన వ్యాఖ్యలు అనిపిస్తున్నాయి. ఎందుకంటే తిరుమలని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకునే కుట్ర జరుగగా అది ప్రజల్లోకి వెళ్లి కాస్త టెన్షన్ వాతావరణం ఏర్పడడంతో మళ్ళి వెనక్కి తగ్గింది కేంద్రం. అయితే ఇప్పుడు రమణ దీక్షితులు కూడా అలాంటి డిమాండ్ నే చేయడం ఇప్పుడు ఆయన వెనుక బీజేపీ ఉందా ? అనే అనుమానాలని రేకెత్తిస్తున్నాయి. కేంద్రం పురావస్తు శాఖకింద స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేయగా ఇప్పుడు రమణ దీక్షితులు కూడా కేంద్ర ఎక్స్‌పర్ట్‌ కమిటీతో అతి ప్రాచీన ఆలయాలను కాపాడాలని, ఇందులో పురావస్తు, ఆగమ శాస్త్ర పండితులు, ఆభరణాల నిపుణులు, స్వామివారి సేవే పరమావధిగా కలిగిన పరిపాలన సీనియర్ అధికారులు ఉండాలని డిమాండ్ చేయడం ఇది ఆపరేషన్ గరుడ లోని భాగమే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.