బాబు దీక్ష…బీజేపీని భయపెట్టినట్టే…?

Chandrababu Naidu Ends Deeksha Hits Out Amit Shah Letter In End Speech

చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్ష ముగిసింది. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన దీక్షను రాత్రి 8 గంటలకు విరమించారు. మాజీ ప్రధాని దేవెగౌడ నిమ్మరసం ఇచ్చి చంద్రబాబుతో పాటూ జేఏసీ నేతలతో దీక్షను విరమింపజేశారు. ధర్మపోరాట దీక్షతో ఏపీ ప్రజలు ఏకాకులు కాదని దేశం మొత్తం బాసటగా ఉందని నమ్మకం వచ్చిందన్నారు చంద్రబాబు. ఏపీ ప్రజలకు భరోసా కల్పించిన ప్రతి ఒక్కరికీ ఐదుకోట్ల ఆంధ్రులు రుణపడి ఉంటారన్నారు. ఇంతమంది అభిమానం, ఆదరణ.. తమకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో బలం చేకూర్చిందని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు అమిత్ షా రాసిన లేఖకు కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. నాలుగున్నరేళ్లగా మోసం చేసి ఇప్పుడు కూడా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ప్రత్యేక హోదాను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇక ముంపు మండలాలను కలిపితేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పానని దీంతో అప్పటికప్పుడు ఆ మండలాలను కలిపారని అన్నారు. రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని మట్టి తెచ్చి మొహాన కొట్టారని ప్రత్యేక హోదా బదులు స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని చెబితే ఒప్పుకున్నానని అలాన్తీ ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని పదే, పదే కోరినా సమాధానం లేదని మిత్ర ధర్మాన్ని ఉల్లంఘించింది బీజేపీనేనని తప్పులు చేసినా మిమ్మల్ని సమర్థించాలా అంటూ ఆఆయన ప్రశ్నించారు. అందుకే బీజేపీతో విభేదించి న్యాయం కోసం పోరాడుతున్నామన్నారు. ఏపీకి అన్యా యం చేశారు కాబట్టి దీక్ష, నిరసనలు తెలియజేస్తున్నామని హామీలను నెరవేర్చని ప్రధానికి ఎలా స్వాగతం పలుకుతామని ప్రశ్నించారు.

తప్పు చేస్తున్నామని పశ్చాత్తాపం కూడా మోదీ, అమిత్ షాలకు లేదన్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని 18 అంశాల అమలును కోరుతూ చంద్రబాబు నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనుంది. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు చంద్రబాబు అండ్ కో రాష్ట్రపతిని కలిసి తమ విన్నపాలను తెలియజేయనున్నారు.అయితే రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలతో కలిసి మాత్రమే రాష్ట్రపతిని చంద్రబాబు కలవనున్నారు. మొదట రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి రాష్ట్రపతిని కలవాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే, రాష్ట్రపతి భవన్‌ కేవలం 11 మందికే అవకాశమివ్వడంతో ఆ మేరకే నేతలను తీసుకొని వెళ్లనున్నారు. రాష్ట్రపతిని కలిసే బృందంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రులు కళా వెంకట్రావు, నక్కా ఆనంద్‌బాబు, అమరావతి ఉద్యోగుల ఐకాస ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్ర మేధావుల ఫోరం ఛైర్మన్‌ చలసాని శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ జేఏసీ అధ్యక్షుడు యు.మురళీకృష్ణ, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, ఏపీ ఏన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ సినీ పరిశ్రమ నుండి ప్రతినిధిగా శివాజీలను ఆయన రాష్ట్రపతిని కలవనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం ఏపీ భవన్‌ నుంచి ర్యాలీగా రాష్ట్రపతి భవన్‌ కు చేరుకుంటారు. రాష్ట్రపతిని కలిసేందుకు లోపలికి 11 మందే వెళ్తారు. మిగిలిన నేతలంతా బయటనే ఉండిపోతారు.