Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు. విజయవాడలో జరిగిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్రం పట్ల మోడీ చూపుతున్న నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదాకు సమానంగా అన్నీ ఇస్తామని ప్రధాని చెబితేనే..తాను ప్యాకేజీకి ఒప్పుకున్నానని, చివరకు ఏపీని దారుణంగా మోసం చేశారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం మోసం అర్ధమయిన వెంటనే టీడీపీ తిరుగుబాటు చేసిందని తెలిపారు. కేంద్రప్రభుత్వంతో విభేదాలు ఉన్నంత మాత్రాన ఏమీ కాదని…ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ఆగవని, మోడీ సాయం చేయకపోతే.. వడ్డీతో సహా కేంద్రం నుంచి ఎలా సాధించుకోవాలో తమకు తెలుసని ధీమా వ్యక్తంచేశారు.
ఏపీలో బీజేపీకి అసలు బలమే లేదని, కానీ వేరే పార్టీ అండచూసుకుని బీజేపీ ఎగిరెగిరి పడుతోందని మండిపడ్డారు. టీడీపీతో పొత్తు వల్లే ఏపీ ఇప్పుడున్న సీట్లలో గెలిచిందన్నారు. తమిళనాడు ప్రజలు కావేరీ బోర్డు కోసం చేస్తున్న పోరాటాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. తమిళుల పోరాటాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని, కావేరీ బోర్డును ఏర్పాటుచేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా పక్కనపెట్టేసిందని, కర్నాటక ఎన్నికల కోసమే కేంద్రం ఇలా చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రజల మనోభావాలతో ఆడుకోవడం సరికాదన్నారు. వైసీపీ ఎంపీలవి రాజీనామాలు కాదని, కేంద్రంతో రాజీపడి రాజకీయ డ్రామాలు ఆడుతూ..ప్రజలకు నామాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. వెనుకబడిన వర్గాలే టీడీపీకి వెన్నెముక అని, వారిలో చైతన్యం తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనని చంద్రబాబు అన్నారు,