9 పేజీల లేఖ‌నిండా అస‌త్యాలు, అర్ధ‌స‌త్యాలే..

Chandrababu Naidu Responds To Amit Shah Letter

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్ర‌ప్ర‌భుత్వంపై అసెంబ్లీ వేదిక‌గా మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. బీజేపీ జాతీయఅధ్య‌క్షుడు అమిత్ షా త‌న‌కు రాసిన 9 పేజీల లేఖ‌ను అసెంబ్లీలో చ‌దివి వినిపించిన‌ చంద్రబాబు…లేఖ‌లో అన్నీ అవాస్త‌వాలు రాశార‌ని ఆరోపించారు. అమిత్ షా లేఖ‌లో అన్నీ అస‌త్యాలే ఉన్నాయ‌ని, ఉన్న‌త‌స్థాయిలో ఉన్న వ్య‌క్తులు ఎందుకు అస‌త్యాలు చెప్పాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన‌వి అడిగితే కేంద్రం బాధ్య‌త లేకుండా తిరిగి ఎదురుదాడి చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బ‌ని, ఒక్క‌మాట కూడా మాట్లాడ‌కుండా లెక్క‌లేనిత‌నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఉత్త‌రాది రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చిన‌ప్పుడు ఏపీకి ఎందుకు ఇవ్వ‌రని, తెలుగువారి ఆత్మ‌గౌర‌వం అంటే కేంద్రానికి లెక్క‌లేదా అని నిల‌దీశారు. కేంద్రం తొలినుంచీ దురుద్దేశంతోనే ఉంద‌ని, హోదాతో స‌మానంగా ప్యాకేజీ ఇస్తామ‌న్నార‌ని, అది ఏమైంద‌ని, ప‌క్క రాష్ట్రాల‌తో స‌మానంగా ఎదిగేదాకా సాయం చేయాల‌ని అడిగామ‌ని, విభ‌జ‌న చ‌ట్టంలోనివి కూడా నెర‌వేర్చ‌కుండా ఎలా స‌మ‌ర్థించుకుంటార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

చివ‌రి బ‌డ్జెట్ లోనూ రాష్ట్రానికి అన్యాయంచేశార‌ని, మిత్ర‌ప‌క్షంగా పాటించాల్సిన ధర్మాన్ని కూడా పాటించ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. కాంగ్రెస్ కంటే బీజేపీనే ఎక్కువ అన్యాయం చేసింద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంద‌న్నారు. విజ‌య‌వాడ ఎయిర్ పోర్ట్ కోసం 1000 ఎక‌రాలు భూమి ఇచ్చామ‌ని, కేంద్రానికి ఇచ్చిన భూమిని రాష్ట్ర‌మే అభివృద్ధి చేసుకుంటే సొంతంగానే విమానాశ్ర‌యం నిర్మించుకోగ‌లిగేవార‌మ‌న్నారు. అమిత్ షా త‌న లేఖ‌లో అమ‌రావ‌తి ఎక్స్ ప్రెస్ హైవే త‌దిత‌రాల గురించి ప్ర‌స్తావించార‌ని, దేశాల్లో చాలా రాష్ట్రాల్లో జాతీయ ర‌హ‌దారులు అభివృద్ధి చేస్తున్నార‌ని, ఏ రాష్ట్రాల్లో ఎంత ఖ‌ర్చు పెట్టారో చ‌ర్చించ‌డం మొద‌లుపెడితే చాలా విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తాయ‌న్నారు. అమిత్ షా లేఖ ఒక జాతీయ‌పార్టీ అధ్య‌క్షుడు రాయాల్సిన విధంగా లేద‌ని, అస‌త్యాలు, అర్ధ‌స‌త్యాల‌తో త‌ప్పులత‌డ‌క‌గా ఉంద‌ని విమ‌ర్శించారు. ఏ రాష్ట్రానికీ చేయ‌ని విధంగా ఏపీ అభివృద్ధికి సాయం చేశామ‌ని అమిత్ షా త‌న లేఖ‌లో పేర్కొన‌డంపై చంద్ర‌బాబు మండిప‌డ్డారు. ప్రాధాన్య‌తా క్ర‌మంలో అనేక అంశాల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే తెలివిగా ఈ లేఖ రాశారన్నారు. ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెట్టేందుకే బీజేపీ ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని చంద్ర‌బాబు ఆరోపించారు.