Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తిరుపతి వేదికగా జరిగిన టీడీపీ ధర్మపోరాట సభలో ప్రతేక హోదా ఇవ్వకుండా ఆటలాడుతున్న కేంద్రం తీరును ఎండగట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున వెంకన్న సాక్షిగా ఇక్కడే మూడు నామాలు చూస్తూ మోదీ ఇచ్చిన హామీలను మళ్లీ గుర్తు చేసేందుకే ఈ సభ పెట్టామని సీఎం ప్రకటించారు. నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటానికి దిగామని… ఈ పోరాటంలో అంతిమ విజయం మనదేనన్నారు బాబు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు పెట్టినా… వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు ఆయన. అలాగే తెలుగు వారి పౌరుషాన్ని చూపించాల్సిన సమయం వచ్చిందని… ఏపీ ప్రజలంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు బాబు. రాబోయే రోజుల్లో ఓ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.
విభజన సమయం నుంచి ఏపీకి అన్యాయం జరుగుతూనే ఉందని విభజన హేతుబద్ధంగా చేయాలని… తాను పదే, పదే చెప్పినా కనీసం పట్టించుకోలేదని… ఆదాయం ఓవైపు… అప్పులు మరోవైపు ఉంచారని కాంగ్రెస్ ని ఉద్దేశిస్తూ చంద్రబాబు విమర్శలు చేశారు. ఇదే విషయాన్ని అప్పుడు తాను చెప్పినా అవహేళన చేశారని అయితే అప్పుడే పుట్టిన రాష్ట్రానికి ప్రయోజనాలు కలుగుతాయన్న ఉద్దేశం తోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని అయినా నాలుగేళ్లుగా ఏపీకి కేంద్రం నమ్మక ద్రోహం చేసిందని… చివరి బడ్జెట్‌లోనైనా న్యాయం చేస్తుందని ఎదురు చూశామని… మళ్లీ మొండి చేయి చూపించినందుకే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని బాబు అన్నారు. పోలవరం నుంచి రాజధాని వరకు ఎన్నో హామీలు కేంద్రం వచ్చిందని కానీ నాలుగేళ్లుగా మొక్కుబడిగా కొన్ని నిధులను మాత్రం కేటాయించారన్నారు చంద్రబాబు. చివరి బడ్జెట్‌లో కనీసం ఏపీ పేరును కూడా ప్రస్తావించకపోవడం దుర్మార్గమన్నారు.
బడ్జెట్‌లో వారికి ఇష్టం వచ్చిన రాష్ట్రాలకు నిధులు కేటాయించారని… పన్నులు కడుతున్న ఏపీకి ఆ అర్హత లేదా అని ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న నవ్యాంధ్ర రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చి, గుజరాత్‌లో పటేల్ విగ్రహానికి రూ.2500 కోట్లు ఇచ్చారంటే మోదీని ఎలా అర్థం చేసుకోవాలో ప్రజలే గ్రహించాలని చంద్రబాబు అన్నారు. హోదా కుదరదని చెప్పారు… తర్వాత స్పెషల్ ప్యాకేజీ అన్నారు… చివరికి ఏమీ ఇవ్వకుండా మొండి చెయ్యి చూపించారని బాబు విమర్శించారు. అందుకే కేంద్రాన్ని నిలదీస్తున్నామని… ఏపీకి న్యాయం చేయాల్సిన ఉందో లేదా చెప్పాలని నిలదీశారు. అలాగే అవినీతి పార్టీని పక్కన పెట్టుకొని టీడీపీని దెబ్బ తీయాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
బీజేపీ అవినీతి పరులతో చేతులు కలిపి డ్రామాలాడుతోందని టీడీపీ బీజేపీ చెప్పినట్లు వినదని తెలిసి… ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తులైతే కంట్రోల్ చేసుకోవచ్చనే అభిప్రాయంలో వాళ్లు ఉన్నారంటూ బీజేపీని విమర్శించారు బాబు. అవినీతి పరులు ప్రధాని కార్యాలయంలో చక్కర్లు కొడుతున్నారని… అక్కడే వాళ్ల రాజకీయం ఏంటో అర్థమైపోతుందన్నారు బాబు. ఇదే సమయంలో ఏపీపై కొన్ని కుట్రలు జరుగుతున్నాయని… వాటిని కూడా సమర్థంగా ఎదుర్కొని ముందుకు సాగుతామన్నారు.
‘‘సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేసుకుంటారా? స్కామాంధ్ర చేసుకుంటారా?’ అని తిరుపతి సభలో ప్రజలను ప్రశ్నించిన మోదీ… ఇప్పుడు అవినీతిపరులకు అండగా ఎలా ఉంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అవినీతి సొమ్మును కక్కిస్తామన్న చెప్పిన ప్రధాని… ఇప్పుడు రాజకీయాల కోసం వారిని అక్కున చేర్చుకుంటున్నారని ఇది కుట్ర రాజకీయం కాదా అని ప్రశ్నించారు. ‘‘మొన్నటి వరకు ఏమీ మాట్లాడని పవన్ కల్యాణ్ కూడా ఉన్నట్టుండి తెలుగుదేశంపై విరుచుకుపడుతున్నారు. మనం ధర్మ పోరాటం చేస్తుంటే… వైసీపీ విశాఖలో నన్ను తిట్టేందుకు మరో కార్యక్రమం చేపట్టింది. ఈ కుట్రల మీద ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని… జరుగుతున్న పరిణామాలను గమనించాలన్నారు చంద్రబాబు.
గతంలో రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కూడా ఎవరూ అడగకముందే… వైసీపీ మద్దతు ఎందుకు ఇచ్చిందో అందరికి తెలుసన్నారు చంద్రబాబు. రాజధాని భూములు, పోలవరం సహా ఎన్నో విషయాలపై కుట్రలు చేశారని… అవి ఏమాత్రం నిలబడలేదన్నారు. ధర్మ పోరాట సభను పక్కదోవ పట్టించేందుకు… విశాఖలో వైసీపీ వంచన దీక్ష చేసిందని విమర్శించారు చంద్రబాబు. దీక్ష పేరుతో తనపై ఇష్టానుసారం మాట్లాడారని… కనీసం మోదీని ఒక్క మాట కూడా ఎందుకు అనలేదో చెప్పాలన్నారు. ‘‘రాష్ట్రం కోసం నేను ప్రధాని మోదీతో పోరాడుతున్నాను. వీళ్లు మాత్రం మోదీపై ఈగ వాలనీయడంలేదు. నాపై ఒంటికాలిపై లేస్తున్నారు. వీళ్లకు సిగ్గుందా?’’ అని వైసీపీ నేతలని బాబు ప్రశ్నించారు. ‘‘పోలవరం పూర్తి చేయడం నా జీవితాశయం. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో, అందరి సహకారంతో దీనిని సాధించి తీరుతాను’’ అని సీఎం ప్రకటించారు.