ఇక జాతీయ కూటమి ఏర్పాట్లలో బాబు !

ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు ప్రక్రియను మళ్లీ వేగవంతం చేశారు. ఒక కాంగ్రెస్ పార్టీ కోలుకున్న సూచనలు ఎగ్జిట్ పోల్స్‌లో కనిపించాయి. రాజస్థాన్ లో,  మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌లలో అధికారం అందుకునే దిశగా సూచనలు కనిపిస్తూండటంతో కూటమికి మరింత ఉత్సాహం వచ్చే వాతావరణం కనిపిస్తోంది. అందుకే ఫలితాల కంటే ఒక్క రోజు ముందే సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. నిజానికి గత నెలలోనే ఈ సమావేశాన్ని నిర్వహించాలనుకున్నా పార్టీల కీలక నేతలందరూ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వాయిదా వేసుకున్నారు. దీంతో నిన్న చంద్రబాబు జాతీయ పార్టీలకు చెందిన పలువురు నేతలతో మాట్లాడారు. జేడీఎస్ నేత దేవేగౌడ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా వామపక్ష నేతలతో మాట్లాడారు. వారందరూ ఢిల్లీ సమావేశానికి రావడానికి అంగీకరించారని సమాచారం.
ఇక జాతీయ కూటమి ఏర్పాట్లలో బాబు ! - Telugu Bullet
అయితే బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షు అఖిలేష్ యాదవ్ ల విషయంలోనే సస్పెన్స్ నెలకొంది. వీరు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రచారంలో రాహుల్ పై విమర్శలు కూడా చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నందున సమావేశానికి హాజరవడం ఇబ్బందన్న ఉద్దేశంతోనే వీరు గత నెలలో హాజరు కాలేదు. ఎన్నికలు అయ్యాయి కాబట్టి పదో తేదీ సమావేశానికి హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరం. సార్వత్రిక ఎన్నికలు ఒక నెల ముందుగా ఏప్రిల్‌లోనే ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే విపక్షాలన్నీ ఇప్పుడే ఐక్యంగా మారి ప్రజల్లో చైతన్య కలిగించాల్సి ఉంది. ఎన్నికల ముందు జట్టుకట్టినా ప్రజల్లో నమ్మకం కలిగించడం కష్టమే కానీ ఎవరి రాజకీయాలు వారివి కాబట్టి కాంగ్రెస్ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తే కూటమికి తిరుగు ఉండనట్లే లెక్క. ఒక వేళ బీజేపీ ప్రొత్సాహకర ఫలితాలు సాధిస్తే మాత్రం బీజేపీయేతర కూటమి కూర్పు చాలా కష్టమవుతుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.