ఏపీ రాజధాని అమరావతిలో ఈరోజు ఉదయం సచివాలయం ఐదు టవర్లకు ర్యాప్ట్ ఫౌండేషన్ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవాళ రెండు కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఒకటి సచివాలయం కోసం ర్యాప్ట్ ఫౌండేషన్, రెండోది రాయలసీమలో ఉక్కు కర్మాగారానికి శంఖుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని ఇది జీవితంలో మరచిపోలేని సంఘటన అని అన్నారు. అత్యంత సాంకేతికత పరిజ్ఞానంతో సచివాలయ టవర్ల నిర్మాణం జరుగుతుందని ప్రపంచానికే తలమానికంగా సచివాలయ టవర్లు నిర్మిస్తామని తెలిపారు. దేశంలోనే తొలిసారి ర్యాప్ట్ ఫౌండేషన్ విధానం తీసుకొచ్చామని 36 నెలల్లో టవర్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నంగా రాజధాని నిర్మాణం జరుగుతుందని, బౌద్దస్తూపం ఆకారంలో ఐకానిక్ భవనం నిర్మిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. సచివాలయ ప్రాంగణంలో 4వేల కార్లు పార్క్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఒకే సారి 10వేల మంది విజిటర్స్‌కు ఆతిథ్యం లభిస్తుందని, 1375 ఎకరాలలో పరిపాలన భవనాలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా హైకోర్టు విభజనను స్వాగతిస్తున్నామని చంద్రబాబు అన్నారు.
జనవరి1 నుంచి విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీసులో తాత్కాలికంగా హైకోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. అమరావతిలో శాశ్వత భవనం నిర్మించిన తర్వాత.. ప్రస్తుత తాత్కాలిక హైకోర్టును జిల్లా కోర్టుగా మారుస్తామన్నారు. మరోపక్క కడప జిల్లా వాసుల పదేళ్ల కల ఫలించి దాదాపు లక్ష మందికి ఉపాధినిచ్చే రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు పునాదిరాయి పడింది. గత కొంతకాలంగా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సీఎం రమేష్, బి.టెక్ రవి వంటి నేతలు దీక్షలు కూడా చేసారు. అయినా కేంద్రం మాత్రం కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముందుకి రాలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం తామే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటామని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే ఈరోజు మైలవరం మండలం కంబాలదిన్నెలో సీఎం చంద్రబాబు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2700 ఎకరాల్లో రూ.18 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ నిర్మాణం జరుగనుంది.