దేశంలో బీజేపీయేతర పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఆయా పక్షాల నేతలను కలుస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీతోనూ సమావేశం కానున్నారు. ఇందుకోసం చంద్రబాబు ఈ నెల 19న కోల్‌కతా వెళ్లనున్నట్లు ‘ప్రముఖ చానల్’ ఒక కధనం ప్రచురిదింది. రెండు వారాల క్రితం ఢిల్లీలో స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిసిన చంద్రబాబు, పలువురు ఇతర పార్టీల నేతలతోనూ సమావేశమయ్యారు.
గత వారం బెంగుళూరు వెళ్లి జేడీఎస్ అధినేత దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామిని కలిసిన చంద్రబాబు, ఆ తర్వాత చెన్నైలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో మమతతోనూ నేరుగా కలిసి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. బీజేపీయేతర పక్షాలకు ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై 19న మమతతో చంద్రబాబు చర్చిస్తారు. కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు, సానుకూలతలపై మంతనాలు జరుపుతారని తెలుస్తోంది. కాగా జనవరి 18న గానీ, 19న గానీ కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించాలని మమత నిర్ణయించారు. ఆ ర్యాలీకి అన్ని బీజేపీయేతర పార్టీలను పిలవాలని యోచిస్తున్నారు. దీనిపైనా ఇరు నేతలు చర్చిస్తారు. ఢిల్లీలో ఈ నెల 22న జరపతలపెట్టిన బీజేపీయేతర పక్షాల విందు సమావేశంపైనా మాట్లాడుకుంటారని తెలుస్తోంది.