తాజాగా ఢిల్లీకి వెళ్లి, రాహుల్ గాంధీని కలిసి, కాంగ్రెస్ పార్టీ తో నడిచేందుకు తాము సిద్ధం అని జాతీయ మీడియా ముందు ప్రకటించిన చంద్రబాబు నాయుడు పైన వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు పేల్చాడు. “చంద్రబాబు నాయుడు పొలిటికల్ దళారి గా అవతారం ఎత్తాడనీ, మొన్నటివరకు సోనియాని రాక్షసి అని, తనని బొంద పెట్టాలని, తరిమి కొట్టాలని పెడబొబ్బలు పెట్టాడని, ఇప్పుడేమో రాహుల్ గాంధీ కళ్ళు పట్టుకొని ప్రజాస్వామ్యం పరిరక్షణ అంటూ నీతి కబుర్లు చెప్తున్నాడని, అసలు ఈ మనిషికి సిగ్గు శరం అనేది ఉందా?” అని చంద్రబాబు పై నిప్పులు చెరిగాడు.
దీనితో పాటు, గతంలో అమరావతిలో కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా చేసిన విమర్శల తాలూకు పేపర్ క్లిప్పింగ్ ని కూడా జత చేశాడు.ఆ క్లిప్పింగ్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీది విదేశీ పాలన అని, తెలుగు జాతి పై పెత్తనం చేస్తే సహించబోమని, దేశానికి స్వాతంత్రం రావాలంటే కాంగ్రెస్ ని పూర్తిగా సాగనంపాలని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ మీద విమర్శలు చేశారు.
కాగా, నిన్నేమో హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి, రాహుల్ గాంధీ తో చేతులు కలిపి, ప్రజాస్వామ్యం పరిరక్షణ అంటూ నీతి వాక్యాలు పలుకుతూ, ఈ కలయిక సీట్లకోసమో, అధికారం కోసమో కాదని చెపుతున్న చంద్రబాబు నాయుడు మాటలకి తెలుగు రాష్ట్రాల ప్రజలు నవ్వుకుంటున్నారన్న విషయం తెలుసుకోవాలని హితవు పలికారు.